
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మైదానంలో బౌలర్ల పాలిట సింహస్వప్నమైన వీరూ.. దయాగుణం చాటే విషయంలో తోటి క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆపదలో ఉన్నవారికి తానున్నానంటూ భరోసా ఇచ్చిన ఈ నజఫ్‌ఘడ్ నవాబ్.. తాజాగా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సెహ్వాగ్ తీసుకున్న ఈ నిర్ణయంపై యావత్ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరూపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే రాజు కాలేడు.. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకున్నప్పుడే నిజమైన రాజు అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మైదానంలో బౌలర్ల పట్ల కఠినంగా ఉండే సెహ్వాగ్.. నిజ జీవితంలో ఇంతా దయాగుణం కలిగి ఉండటాన్ని చూసి జనాలు ఇతన్ని మనసున్న మహారాజు అంటూ కీర్తిస్తున్నారు. సెహ్వాగ్‌ను చూసైనా తోటి క్రీడాకారులు రైలు ప్రమాద బాధితులకు తోచిన సాయం చేయాలని సూచిస్తున్నారు. కాగా, సెహ్వాగ్ కరోనా సమయంలో కూడా ఇబ్బందుల్లో ఉన్న చాలా మందికి సాయం చేశాడు. ప్రతి శీతాకాలంలో ఈ మనసున్న క్రికెటర్ ఢిల్లీ వీధుల్లో చలికి వణికిపోయే వారికి దుప్పట్లు, స్వెటర్లు అందిస్తుంటాడు.
ఓ వింటర్ అతను తన స్వెటర్‌ను సైతం వేలం వేసి, దాంతో వచ్చిన డబ్బును పేదల కోసం వినియోగించాడు. అంతే కాదు, ప్రమాదాలు, విపత్తుల సమయంలో కూడా సెహ్వాగ్ తక్షణమే స్పందిస్తుంటాడు. వీరూ భాయ్.. బయటి ప్రపంచానికి తెలియకుండా చాలా గుప్త దానాలు చేశాడని అతనికి తెలిసిన వారంటుంటారు. కేవలం సంపాదన మాత్రమే తెలిసిన నేటి తరం క్రీడాకారుల్లో సెహ్వాగ్ ఓ ఆణిముత్యమని వేనోళ్లు కీర్తిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, 44 ఏళ్ల సెహ్వాగ్ 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. ఈ మధ్యలో అతను 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. ఇందులో మొత్తంగా 17253 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 23 సెంచరీలు, వన్డేల్లో 15 సెంచరీలు సెహ్వాగ్ ఖాతాలో ఉన్నాయి. సెహ్వాగ్ పేరిట టెస్ట్‌ల్లో 3 డబుల్ సెంచరీలు, 2 ట్రిపుల్ సెంచరీలు ఉన్నాయి. తన టైమ్‌లో వీరూ అరివీర భయంకరులైన బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. -మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్
చదవండి: IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిపై వేటు..?