టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండిన ఓ లాంగ్ స్టాండింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు (భారత్ తరఫున) గతంలో సెహ్వాగ్ పేరిట ఉండేది. 2003 పర్యటనలో సెహ్వాగ్ ఆస్ట్రేలియాపై 6 సిక్సర్లు బాదాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డి సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌లో నితీశ్ ఇప్పటికే 7 సిక్సర్లు బాదాడు. ఈ సిరీస్‌లో ఇంకా మూడు టెస్ట్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. నితీశ్ ఈ సిరీస్‌లో మరిన్ని సిక్సర్లు బాదే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగిన ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు..
నితీశ్ కుమార్ రెడ్డి-7 (2024)
వీరేంద్ర సెహ్వాగ్-6 (2003)
మురళీ విజయ్-6 (2014)
సచిన్ టెండూల్కర్-5 (2007)
రోహిత్ శర్మ-5 (2014)
మయాంక్ అగర్వాల్-5 (2018)
రిషబ్ పంత్-5 (2018)
ఇదిలా ఉంటే, అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (140) శతక్కొట్టడంతో 337 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో సిరాజ్, బుమ్రా తలో నాలుగు వికెట్లు పడగొట్టారు.
157 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మరోసారి ఘోరంగా విఫలమైంది. కమిన్స్ (5/57) ధాటికి భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డే (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
19 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ 3.2 ఓవర్లలో వికెట్ నష్ట పోకుండా విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ 1-1తో సమంగా నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment