
లంక ప్రీమియర్ లీగ్-2023లో బి లవ్ క్యాండీ జట్టు రెండో విజయం నమోదు చేసింది. ఈ లీగ్‌లో భాగంగా శనివారం జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బి లవ్ క్యాండీ ఘన విజయం సాధించింది. 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ.. కేవలం 13 ఓవర్లలోనే ఊదిపడేసింది.
హసరంగా ఆల్ రౌండ్ షో..
ఈ మ్యాచ్‌లో క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి జాఫ్నా కింగ్స్ పతనాన్ని శాసించిన హసరంగా.. బ్యాటింగ్‌లో కూడా దుమ్ము రేపాడు. కేవలం 21 బంతుల్లోనే హసరంగా తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ ఏడాది సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా వనిందు నిలిచాడు.
ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కొన్న హసరంగా.. 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగుల చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఫఖర్ జమాన్(42) పరుగులతో రాణించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 117 పరుగులు మాత్రమే చేయగల్గింది. క్యాండీ బౌలర్లలో హసరంగాతో పాటు ప్రదీప్ మూడు వికెట్లు పడగొట్టి జాఫ్నాను దెబ్బతీశాడు. జాఫ్నా బ్యాటర్లలో దునిత్ వెల్లలాగే(38) పరుగలతో ఒంటరి పోరాటం చేశాడు.
చదవండి: Asia cup 2023: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ క్రికెట్ కీలక నిర్ణయం.. మాజీ కెప్టెన్‌కు!