WC 2023- Major Blows To Pakistan Team: ఘన విజయంతో ఆసియా కప్-2023 టోర్నీని ఆరంభించిన పాకిస్తాన్ ఆఖరి వరకు అదే జోరును కొనసాగించలేకపోయింది. నేపాల్‌ను చిత్తు చేసి సూపర్-4లో తొలుత అడుగుపెట్టిన బాబర్ ఆజం బృందానికి రోహిత్ సేన చెక్ పెట్టిన విషయం తెలిసిందే.
కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేసి
చిరకాల ప్రత్యర్థిని ఏకంగా 228 పరుగులతో చిత్తు చేసిన టీమిండియా శ్రీలంకతో మ్యాచ్‌లోనూ గెలుపొంది ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. దాయాది చేతిలో ఘోర పరాభవం పాలైన నేపథ్యంలో.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌కు గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం పాక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
బాబర్ వర్సెస్ ఆఫ్రిది
అయినప్పటికీ, ఆఖరి వరకు పోరాడగలిగినా శ్రీలంక చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లంకతో మ్యాచ్ అనంతరం.. కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ పేసర్ షాహిన్ ఆఫ్రిది డ్రెస్సింగ్‌రూంలో గొడవపడినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బాబర్ ఆజం- షాహిన్ ఆఫ్రిది
సీనియర్లు కూడా ఇలాగేనా ఆడేది..
వీరిద్దరి వాగ్యుద్ధం తారస్థాయికి చేరగా.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సర్దిచెప్పినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా సీనియర్ ఆటగాళ్లు కూడా ఆశించిన మేర రాణించకపోవడం లేదని, బాధ్యతాయుతంగా ఆడని కారణంగానే ఓటమి ఎదురైందంటూ బాబర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎవరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు
మధ్యలో కలుగజేసుకున్న ఆఫ్రిది.. అంత అసహనం పనికిరాదని.. కనీసం మెరుగ్గా ఆడిన బౌలర్లు, బ్యాటర్లను ప్రశంసించవచ్చు కదా అని బాబర్‌కు కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సమాధానంగా.. జట్టులో ఎవరు బాగా ఆడుతున్నారు.. ఎవరు ఏం చేస్తున్నారో తనకు తెలుసునని గట్టిగానే బదులిచ్చినట్లు సదరు మీడియా తెలిపింది.
ఈ క్రమంలో రిజ్వాన్ సహా కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ చొరవతీసుకుని బాబర్- ఆఫ్రిదిలను కూల్ చేసినట్లు పేర్కొంది. అయితే, ఆఫ్రిది మాటలకు నొచ్చుకున్న బాబర్.. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా టీమ్ బస్సులోకెక్కి కూర్చున్నాడని సమాచారం.
వరల్డ్‌కప్‌నకు ముందు పాక్‌కు దెబ్బ మీద దెబ్బ
కాగా వన్డే వరల్డ్‌కప్-2023కి సమయం సమీపిస్తున్న తరుణంలో ఆసియా కప్‌లో ఓటమితో నంబర్ 1 స్థానాన్ని పోగొట్టుకున్న పాకిస్తాన్ జట్టు సమస్యలతో సతమతమవుతోంది. ఓవైపు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్ గాయాల బారిన పడ్డారు.
వాళ్లు సెలక్షన్‌కు ఎప్పుడు అందుబాటులోకి వస్తారో తెలియదు. ఇలాంటి తరుణంలో.. ఆసియా కప్ పరాభవంతో ఆగ్రహంతో ఉన్న బాబర్‌తో ఆఫ్రిది గొడవ విభేదాలకు దారి తీయడం.. ఇలా ఏది చూసినా పాకిస్తాన్‌కు ప్రస్తుతం టైమ్ బాగా లేదనే అనిపిస్తోందని క్రికెట్ అభిమానులు అంటున్నారు.
చదవండి: WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్ అయ్యర్‌కు నో ఛాన్స్! ఇక మర్చిపోవాల్సిందేనా?
Comments
Please login to add a commentAdd a comment