ICC Cricket World Cup 2023 Ban Vs Pak: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా వరుస ఓటములకు ముగింపు పలికి సెమీస్ రేసు నుంచి తాము పూర్తిగా నిష్క్రమించలేదని చాటిచెప్పింది.
వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్
మరోవైపు.. పాక్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్ ప్రపంచకప్ ఈవెంట్ సెమీస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ పేసర్ల విజృంభణతో ఆది నుంచే ఎదురుదెబ్బలు తిన్న షకీబ్ అల్ హసన్ బృందం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది.
పాక్ పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ
బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిటన్ దాస్(45), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(43), మెహదీ హసన్ మిరాజ్(25) పర్వాలేదనిపించగా.. మహ్మదుల్లా అర్ధ శతకం(56)తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది.
పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 3, హ్యారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్‌కు మూడు వికెట్లు దక్కగా.. స్పిన్ బౌలర్లు ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ చెరో వికెట్ తీశారు.
అదరగొట్టిన పాక్ ఓపెనర్లు
ఇక బంగ్లా విధించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన పాకిస్తాన్ 32.3 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షషీక్(68), ఫఖర్ జమాన్(81) హాఫ్ సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.
బాబర్ నిరాశపరిచినా.. రిజ్వాన్ పూర్తి చేశాడు
అయితే, కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(26), ఇఫ్తికర్ అహ్మద్(17) ఆఖరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు.
ఈ మ్యాచ్‌లో 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసిన ఫఖర్ జమాన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక బంగ్లాపై గెలుపుతో పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment