భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్‌ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్‌పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి.
లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం.
ఈ మేరకు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్‌లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం.
రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం.
ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు.
ఓపెనర్ ఫఖర్ జమాన్‌తో పాటు ఆల్‌రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్‌లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు.
చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా
Comments
Please login to add a commentAdd a comment