వెస్టిండీస్ జట్టు
West Indies Vs India: వెస్టిండీస్- టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకోనుందా? జూలై 12న మొదలు కావాల్సిన టెస్టు సిరీస్ ఆలస్యం కానుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వెస్టిండీస్ ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
జూన్ 18న జింబాబ్వే వేదికగా సీడబ్ల్యూసీ(క్రికెట్ వరల్డ్ కప్) క్వాలిఫయర్స్ మొదలైంది. ఇక తమ తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడ్డ విండీస్ 39 పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించి శుభారంభం చేసింది.
ఈ క్రమంలో జూన్ 22న నేపాల్‌తో.. తదుపరి జూన్ 24న ఆతిథ్య జింబాబ్వేతో పోటీపడనుంది. గ్రూప్-ఏలో భాగంగా జింబాబ్వేతో మ్యాచ్ కరేబియన్లకు కీలకం కానుంది. ఆ తర్వాత జూన్ 26న నెదర్లాండ్స్‌ను ఢీకొట్టనుంది విండీస్.
సూపర్ సిక్సెస్‌లో అడుగుపెడితేనే
ఈ క్రమంలో సూపర్ సిక్సెస్ స్టేజ్‌లో అడుగుపెట్టాలని భావిస్తున్న వెస్టిండీస్ అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ 29- జూలై 7 వరకు బిజీ అవుతుంది. ఇక ఈవెంట్ జూలై 9 నాటి ఫైనల్‌తో ముగియనుంది. రెండుసార్లు వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిన వెస్టిండీస్ కచ్చితంగా ఫైనల్ చేరి భారత్ వేదికగా జరుగనున్న ప్రపంచకప్-2023కి అర్హత సాధించాలనే దృఢ సంకల్పంతో ఉంది.
ఇదిలా ఉంటే.. మాజీ చాంపియన్ విండీస్ ఒకవేళ హరారే వేదికగా జరుగనున్న ఫైనల్ ఆడితే.. ఆ మ్యాచ్ ముగిసిన రెండ్రోజుల వ్యవధిలోనే టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంటుంది. నిజానికి వెస్టిండీస్ పరిమిత ఓవర్లు, రెడ్‌బాల్ క్రికెట్‌కు వేర్వేరు జట్లను ఆడిస్తుంది.
ఆ నలుగురు
అయితే, ఈసారి క్వాలిఫయర్స్ ఆడే జట్టులో జేసన్ హోల్డర్, కైలీ మేయర్స్, రోస్టన్ చేజ్, అల్జారీ జోసెఫ్ తదితర రెండు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు ఉన్నారు. వీరు నలుగురు యూఎస్‌ఏతో తొలి మ్యాచ్‌లో ఆడారు కూడా!
ఈ క్రమంలో వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ ముగించుకుని జింబాబ్వే నుంచి విండీస్ చేరుకోవడానికే ఒకటిన్నర రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాతో టెస్టు సిరీస్ ఆలస్యమయ్యే అవకాశాలున్నట్లు క్రిక్‌బజ్ నివేదికలో పేర్కొంది.
మాకు అదే ముఖ్యం
ఈ విషయంపై వెస్టిండీస్ చీఫ్ సెలక్టర్ డెస్మాండ్ హెయిన్స్‌ను సంప్రదించగా.. ‘‘మేము ముందు వరల్డ్‌కప్ ఈవెంట్‌కు అర్హత సాధించాలి. ఆ తర్వాతే మిగతా అంశాలపై దృష్టి సారిస్తాం. మాకు వివిధ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి టెస్టు ప్లేయర్లపై భారం పడదు’’ అని పేర్కొన్నట్లు తెలిపింది.
కాగా వెస్టిండీస్- భారత్ మధ్య జూలై 12- 24 వరకు రెండు టెస్టులు, జూలై 27- ఆగష్టు 1 వరకు మూడు వన్డేలు, ఆగష్టు 3- 13 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: ధోనికి పిల్లనిచ్చిన అత్తగారు! ఆ కంపెనీ సీఈఓ.. రూ. 800 కోట్ల సామ్రాజ్యం!
Ind Vs WI: ఆ ముగ్గురు దూరం.. యువ సంచలనం ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment