న్యూఢిల్లీ: మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఐపీఎల్ సందడి వేలంతోనే ప్రారంభమవుతుందనే విషయం తప్పక ఒప్పుకోవాల్సింది. తమ అభిమాన జట్టు ఇలా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ తమ డ్రీమ్ టీమ్‌ను కూడా ఎంపిక చేసుకుంటారు. ఒకవేళ అనూహ్యంగా ఎవరైనా జట్టులోకి వస్తే అతన్ని ఎందుకు తీసుకున్నారనే చర్చ, మంచి ఆటగాడిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించకపోతే అది ఎందుకు జరిగిందనే వాదన కూడా చేస్తూ ఉంటారు. మరి ఈసారి చతేశ్వర్ పుజారా గురించే ఎక్కువ చర్చ నడిచింది. అసలు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) పుజారాను కొనుగోలు చేయడానికి కారణం ఏమిటనే డౌట్ కూడా వచ్చింది అభిమానులకు. పుజారా టెస్ట్ ప్లేయర్ కదా చెన్నై జట్టు ఎందుకు కొనుగోలు చేసారు..అనేది ఆ ఫ్రాంచైజీ అభిమానులకు అనుమానం. ఇక్కడ సీఎస్‌కే వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనే చెప్పాలి.
ధోనితో యాంకర్ ఇన్నింగ్స్ ఆడటానికి భారత జట్టులో, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక ప్లేయర్ ఖచ్చితంగా ఉంటారు. చాలా సంవత్సరాల వరకు ధోని యాంకర్ ప్లేయర్ గా ఉన్నారు. కానీ ధోని 5 డౌన్ వచ్చేసరికి …అప్పటికే చాలా వికెట్లు నష్టపోతున్నారు. కాబట్టి టాప్ 3 లోనే ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్ కోసం చెన్నై జట్టు వెతుకుతుంది. మురళి విజయ్ టీం లో ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. టాప్ ఆర్డర్ లో ప్రెషర్ అంతా రాయుడు పైనే పడుతుంది. పైగా ఈ సారి వాట్సన్ కూడా రిటైర్ అవ్వడంతో చెన్నై జట్టు స్టాండ్ ఇచ్చే ప్లేయర్ కోసం చూస్తున్నారు. ఇంతకముందు జట్టులో రైనా ఉండడంతో చాలా బలంగా కనిపించింది. కానీ గత సీజన్ లో రైనా దూరమయ్యాడు. తద్వారా సీఎస్‌కే పటిష్టతను కోల్పోయింది.
రితురాజ్ గైక్వాడ్ లాంటి యంగ్ ప్లేయర్స్ తో పార్టనర్ షిప్ బిల్డ్ చేయడానికి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి. ఆ ఉద్దేశంతోనే పుజారాకు అవకాశం ఇచ్చారు అనిపిస్తుంది. టీ20ల్లో కూడా భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యమని టీమిండియా కెప్టెన్‌గా ధోని ఉన్న సమయంలో చాలాసార్లు స్పష్టం చేశాడు. వికెట్లు పడిపోతున్నప్పుడు తిరిగి గాడిలో పడాలంటే వికెట్లను కాపాడే ప్లేయర్ ఉండాలనే విషయాన్ని ధోని గట్టిగా నమ్ముతాడు. దాంతోనే పుజారాను సీఎస్‌కే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిందని చెప్పాలి. కొన్ని ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడటానికి సిద్ధమైన పుజారాను సీఎస్‌కే తీసుకోవడానికి ఎఫెన్సే కాదు.. డిఫెన్స్ కూడా కావాలనే ధోని బలంగా నమ్మే సూత్రమే కారణం కావొచ్చు. 2014లో చివరిసారి ఐపీఎల్‌లో కనిపించిన పుజారా.. ఏడేళ్ల అనంతరం వచ్చిన అవకాశాన్ని ఎలా వినియోగించుకుంటాడో చూడాలి. ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30 వరకూ ఐపీఎల్ జరుగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. ఇక్కడ చదవండి: ఐపీఎల్... ప్రేక్షకుల్లేకుండానే!
Comments
Please login to add a commentAdd a comment