గాలే: ఆధునిక క్రికెట్‌లో రిజర్వ్ డే గురించే అభిమానులకు తెలుసు! ప్రపంచకప్ మెగా ఈవెంట్లకు, మేజర్ టోర్నీల ఫైనల్స్‌కు రిజర్వ్ డేలు ఉండటం సర్వసాధారణం. అయితే విశ్రాంతి రోజు మాత్రం అంతగా తెలీదు. పైగా టెస్టు మ్యాచ్ మధ్యలో ఇచ్చే విశ్రాంతి దినం మూడు దశాబ్దాల క్రితం ఉండేది.
కానీ ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత అరుదు. ఇలాంటి అరుదైన ఘటనే ప్రస్తుతం శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టులో జరిగింది. గాలేలో 18న మొదలైన తొలి టెస్టులో మూడు రోజుల ఆట ముగిసింది. శనివారం నాలుగో రోజు ఆట ఉండేది. కానీ విశ్రాంతి రోజుగా ప్రకటించడంతో తర్వాతి రెండు రోజుల ఆటను ఆది, సోమవారాల్లో నిర్వహిస్తారు. ఇదేంటి కొత్తగా విశ్రాంతి దినమెందుకు అంటే... శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలే కారణం.
రాజపక్స, గొటబాయ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో దివాళా తీసిన శ్రీలంక... తదనంతరం నెలకొన్న రాజకీయ అస్థిరత పరిస్థితుల వల్ల తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు ఆ సంక్షోభం తర్వాత జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కావడంతో స్వదేశంలోనే ఉన్న శ్రీలంక క్రికెటర్లు, సహాయ సిబ్బంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లంక క్రికెట్ బోర్డు రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో విశ్రాంతి రోజును కూడా షెడ్యూలులో చేర్చింది.
దీంతో లంక క్రికెటర్లంతా వారి వారి సొంత ఊర్లలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసి అధ్యక్ష ఎన్నికల్లో భాగం చేసింది. లంక టీమ్‌లో కామెందు మెండిస్ ఒక్కటే గాలేకు చెందినవాడు. అతను స్థానికంగానే తన ఓటు హక్కు వినియోగించుకోనుండగా...మిగతావారంతా స్వస్థలాలకు పయనమయ్యారు.
రీ షెడ్యూల్ చేయలేరా!
ఇదంతా ఎందుకు తొలిటెస్టును రీ షెడ్యూల్ చేస్తే పోలా... అనే ఉచిత సలహాలెన్నో వస్తాయి. కానీ ఈ ద్వైపాక్షకి సిరీస్‌కు సంబంధించిన షెడ్యూలు చాలా ముందుగా ఖరారైంది. న్యూజిలాండ్ కూడా బిజీ షెడ్యూలుతోనే ఉపఖండం పర్యటనకు వచ్చింది.
లంక కంటే ముందు అఫ్ఘానిస్తాన్‌కు సంబంధించి భారత్‌లో ఏకైక టెస్టు కోసం నోయిడాకు వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్ వర్షార్పణమైంది. లంక పర్యటన తర్వాత కివీస్ తిరిగి భారత్‌కు వెళ్లి మూడు టెస్టుల సిరీస్‌లో ఆడాల్సివుంది. ఇలాంటి పరిస్థితుల్లో లంకలో టెస్టును రీషెడ్యూల్ చేయడం అసాధ్యం కాబట్టే మధ్యలో విశ్రాంతి రోజు ఇచ్చారు. క్రికెట్ చరిత్రలో ఓ మ్యాచ్ మధ్యలో ఇలా రెస్ట్ ఇవ్వడం ఇదే కొత్తకాదు.
1990 కంటే పూర్వం టెస్టుల్లో తరచూ విశ్రాంతి రోజులుండేవి. ఆ తర్వాత చాలా ఏళ్లు తెరమరుగైన ‘రెస్ట్ డే’ 2008లో బంగ్లాదేశ్‌లో తెరమీదికొచ్చింది. బంగ్లాదేశ్‌లోనే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బంగ్లా, శ్రీలంక టెస్టు మ్యాచ్ మధ్యలో విశ్రాంతి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment