Wimbledon 2023: Rohan Bopanna-Matthew Ebden Enter Into Men's Doubles Semifinal - Sakshi
Sakshi News home page

Wimbledon 2023: సెమీస్‌లో బోపన్న జోడి.. మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్‌!

Published Thu, Jul 13 2023 7:48 AM | Last Updated on Thu, Jul 13 2023 10:39 AM

Wimbledon 2023: Rohan Bopanna-Matthew Ebden Enter-Mens Doubles Semifinal - Sakshi

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో భాగంగా పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 6–7 (3/7), 7–5, 6–2తో టాలన్‌ గ్రీక్స్‌పూర్‌–బార్ట్‌ స్టీవెన్స్‌ (నెదర్లాండ్స్‌) జంటను ఓడించింది. 2015 తర్వాత  వింబుల్డన్‌ టోర్నీలో బోపన్న డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. 

మహిళల సింగిల్స్‌లో ఈసారి కొత్త చాంపియన్‌


ఆన్స్‌ జబర్‌, ఎలీనా రిబాకినా

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఈసారి కొత్త చాంపియన్‌ అవతరించనుంది. ట్యునిషియా క్రీడాకారిణి, ప్రపంచ ఆరో ర్యాంకర్‌ ఆన్స్‌ జబర్‌ ధాటికి డిఫెండింగ్‌ చాంపియన్, మూడో సీడ్‌ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్‌) క్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో గత ఏడాది రన్నరప్‌ ఆన్స్‌ జబర్‌ 6–7 (5/7), 6–4, 6–1తో రిబాకినాను బోల్తా కొట్టించి వరుసగా రెండో ఏడాది ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

గంటా 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జబర్‌ తొలి సెట్‌ను టైబ్రేక్‌లో కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుసగా రెండు సెట్‌లు గెలిచి విజయం దక్కించుకుంది. ఎనిమిది ఏస్‌లు సంధించిన జబర్‌ నెట్‌ వద్దకు 11 సార్లు దూసుకొచ్చి 9 సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు రిబాకినా 22 సార్లు నెట్‌ వద్దకు వచ్చి 10 సార్లు మాత్రమే పాయింట్లు నెగ్గింది. 35 విన్నర్స్‌ కొట్టిన జబర్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. రిబాకినా 20 అనవసర తప్పిదాలు చేసింది.

సెమీస్‌కు చేరుకున్న సబలెంకా
మరో క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సబలెంకా (బెలారస్‌) అలవోక విజయంతో రెండోసారి వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 87 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 6–2, 6–4తో 25వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)పై గెలిచింది. రెండో సెట్‌లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడినా ఆందోళన చెందకుండా పట్టుదలతో ఆడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలిచి విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో స్వితోలినా (ఉక్రెయిన్‌)తో వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌); ఆన్స్‌ జబర్‌తో సబలెంకా తలపడతారు. 


సెమీస్‌లో ప్రవేశించిన సబలెంకా, అల్కారాజ్‌

తొలిసారి సెమీస్‌లోకి అల్‌కరాజ్, మెద్వెదెవ్‌ 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌), మూడో ర్యాంకర్‌ మెద్వెదెవ్‌ (రష్యా) తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో మెద్వెదెవ్‌ 2 గంటల 58 నిమిషాల్లో 6–4, 1–6, 4–6, 7–6 (7/4), 6–1తో క్రిస్టోఫర్‌ యుబాంక్స్‌ (అమెరికా)పై, అల్‌కరాజ్‌ 7–6 (7/3), 6–4, 6–4తో ఆరో సీడ్‌ హోల్గర్‌ రూనె (డెన్మార్క్‌)పై గెలిచారు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో జొకోవిచ్‌ (సెర్బియా); మెద్వెదెవ్‌తో అల్‌కరాజ్‌ ఆడతారు. 

చదవండి: #BrijBhushanSharan: 'చుప్‌'.. మైక్‌ విరగ్గొట్టి రిపోర్టర్‌తో దురుసు ప్రవర్తన

#NovakDjokovic: 46వసారి సెమీస్‌లో.. ఫెదరర్‌ రికార్డు సమం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement