మహిళల ఆసియా కప్ 2024లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. యూఏఈతో ఇవాళ (జులై 21) జరిగిన మ్యాచ్‌లో భారత్ 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ సేన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా.. యూఏఈ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.
రిచా ఘోష్ ఊచకోత.. హర్మన్ మెరుపు హాఫ్ సెంచరీ
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. హర్మన్‌ప్రీత్ కౌర్ (47 బంతుల్లో 66; 7 ఫోర్లు, సిక్స్), రిచా ఘోష్ (29 బంతుల్లో 64 నాటౌట్; 12 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసింది. ఆఖరి ఓవర్‌లో రిచా ఘోష్ ఆకాశమే హద్దుగా చెలరేగి చివరి ఐదు బంతులను బౌండరీలుగా మలిచింది. ఫలితంగా టీమిండియా టీ20ల్లో తొలిసారి 200 పరుగుల మార్కును దాటింది.
భారత ఇన్నింగ్స్‌లో హర్మన్, రిచాతో పాటు షఫాలీ వర్మ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, సిక్స్) కూడా రెచ్చిపోగా.. స్మృతి మంధన (9 బంతుల్లో 13), దయాలన్ హేమలత (4 బంతుల్లో 2), జెమీమా రోడ్రిగెజ్ (13 బంతుల్లో 14 పరుగులు) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. యూఏఈ బౌలర్లలో కవిష ఎగోడగే 2, సమైరా ధర్నిధర్కా, హీనా హోచ్చందనీ తలో వికెట్ దక్కించుకున్నారు.
మూకుమ్మడిగా దాడి చేసిన టీమిండియా బౌలర్లు
202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఏఈ.. భారత బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో 123 పరుగులకే పరిమితమైంది. దీప్తి శర్మ 2, రేణుక సింగ్, తనుజా కన్వర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
తిరుగులేని భారత్
ఈ టోర్నీలో గ్రూప్-ఏలో పాకిస్తాన్, నేపాల్, యూఏఈలతో పోటీపడుతున్న భారత్.. వరుసగా రెండు విజయాలతో గ్రూప్ టాపర్‌గా కొనసాగుతుంది. నేపాల్, పాక్ చెరో మ్యాచ్‌లో ఓడిపోయి రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన యూఏఈ ఆఖరి స్థానంలో నిలిచింది.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో థాయ్‌లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, మలేషియా పోటీపడుతున్నాయి. థాయ్‌లాండ్, శ్రీలంక ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో గెలిచి ఒకటి, రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్, మలేషియా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment