
2020 మహిళల టి20 చాలెంజ్ టోర్నీ విజేత ట్రయల్ బ్లేజర్స్ జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మహిళల కోసం పూర్తి స్థాయి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్‌ను నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా వెల్లడించారు. ఈ ఏడాదికి మాత్రం ఎప్పటిలాగే మూడు జట్లతో మహిళల టి20 చాలెంజ్ మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కరోనా కారణంగా గత ఏడాది మహిళల టి20 చాలెంజ్ టోర్నీని నిర్వహించలేదు.
‘మహిళల క్రికెట్‌కు సంబంధించి కూడా త్వరలోనే పరిస్థితులు మారతాయి. ఐపీఎల్ తరహాలో మహిళల టోర్నీ కూడా నిర్వహించాలనే ఆలోచనకు బీసీసీఐ కట్టుబడి ఉంది. అందుకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. మహిళల టి20 చాలెంజ్ టోర్నీకి అభిమానులు, ఆటగాళ్ల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే త్వరలోనే ఐపీఎల్ సాధ్యమమవుతుందని అనిపిస్తోంది’ అని జై షా అన్నారు.
2022లో ఐపీఎల్‌ను పూర్తిగా భారత్‌లోనే నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని, కోవిడ్ పరిస్థితిని సమీక్షించిన తర్వాతే ఒక అంచనాకు వస్తామని ఆయన చెప్పారు. మరోవైపు నాలుగు పెద్ద జట్లతో టి20 టోర్నీ నిర్వహించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు రమీజ్ రాజా చేసిన ప్రతిపాదనపై కూడా జై షా స్పందించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఆదాయంపైనే దృష్టి పెట్టే అలాంటి వాణిజ్యపరమైన ఆలోచనకంటే క్రికెట్‌ను అభివృద్ధి చేయడం ముఖ్యం. ఐపీఎల్ విస్తృతమవడంతో పాటు ప్రతీ ఏడాది ఐసీసీ టోర్నీలు ఉంటున్నాయి. పైగా టెస్టులపై దృష్టి పెడుతూ ద్వైపాక్షిక సిరీస్‌లు కూడా ముఖ్యం. ఇలాంటి సమయంలో తాత్కాలిక ప్రయోజనాలకంటే ఆటకు ప్రాచుర్యం కల్పించడమే కీలకం’ అని షా అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment