ఇండోర్: దేశవాళీ మహిళల క్రికెట్‌లో ముంబై జట్టు అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసింది. సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా ముంబై, నాగాలాండ్ జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తయింది. తొలుత నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్ చేసిన ముంబై మహిళా జట్టు.. అనంతరం లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నాగాలాండ్ జట్టు.. ముంబై కెప్టెన్, మీడియం పేసర్ సయాలీ సత్ఘరె (8.4 ఓవర్లలో 7/5) ధాటికి 17.4 ఓవర్లలో 17 పరుగలకే చాపచుట్టేసింది.
సయాలీ ధాటికి నాగాలాండ్‌కు చెందిన ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోర్‌ని నమోదు చేయలేకపోయారు. సయాలీకి తోడుగా దాక్షిణి (2/12), ఎస్. థాకోర్ (1/0) రాణించారు.అనంతర స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబై కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ ఇషా ఓజా, వృషాలీ భగత్ వరుసగా మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదడంతో మరో 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సయాలికి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment