
నేటి నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ టి20 టోర్నీ
తొలి పోరులో బెంగళూరుతో గుజరాత్ జెయింట్స్ ‘ఢీ’
మార్చి 15న ముంబైలో ఫైనల్
రాత్రి గం.7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మూడో సీజన్‌కు శుక్రవారం తెరలేవనుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ సమరంలో 5 జట్లు 22 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. సీనియర్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధమవుతుండగా... సీజన్ ఆరంభ పోరులో శుక్రవారం గుజరాత్ జెయింట్స్ జట్టుతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ఆడనుంది.
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీ మూడో సీజన్‌కు వేళయింది. తొలి రెండు సీజన్‌లలో మెరిపించిన పలువురు యువతారలు ఆ తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎమర్జింగ్ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రపంచానికి చాటేందుకు అవకాశం లభించనుంది.
గత సీజన్ మాదిరిగానే ఈసారీ ఐదు జట్ల మధ్య లీగ్ మ్యాచ్‌లు ముగిశాక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు నేరుగా ఫైనల్ బెర్త్ లభిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ ద్వారా రెండో ఫైనలిస్ట్‌ను నిర్ణయిస్తారు.
» బెంగళూరుకు గాయాల బెడద వేధిస్తోంది. గతేడాది టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సోఫీ డివైన్ తోపాటు కేట్ క్రాస్, స్పిన్నర్ ఆశ శోభన గాయాలతో టోర్నీ నుంచి వైదొలిగారు.
» పేలవ ఫామ్‌తో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన భారత ఓపెనర్ షఫాలీ వర్మ, పేసర్ అరుంధతి రెడ్డి డబ్ల్యూపీఎల్‌లో రాణించి తిరిగి టీమిండియాకు ఎంపిక కావాలని చూస్తున్నారు. వీరిద్దరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నారు.
» గత రెండు పర్యాయాలు రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. షఫాలీ వర్మ, మెగ్ లానింగ్, జెమీమా రోడ్రిగ్స్, అనాబెల్ సదర్లాండ్, మరిన్ కాప్, శిఖా పాండే, అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, జెస్ జాన్సన్, రాధ యాదవ్‌తో క్యాపిటల్స్ బలంగా ఉంది.
» తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా... హేలీ మాథ్యూస్, యస్తిక భాటియా, నటాలియా స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ కీలకం కానున్నారు.
» గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు కొత్త కెప్టెన్‌లతో బరిలోకి దిగుతున్నాయి. అలీసా హీలీ అందుబాటులో లేకపోవడంతో యూపీ వారియర్స్ జట్టుకు భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కెపె్టన్‌గా వ్యవహరించనుంది. ఇక బెత్ మూనీ స్థానంలో ఆష్లీ గార్డ్‌నర్ గుజరాత్ జెయింట్స్ జట్టుకు సారథ్యం వహించనుంది. ఈ సీజన్‌లో మరో రెండు కొత్త (వడోదర, లక్నో) వేదికలపై కూడా మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment