
తొలి పోరులో బెంగళూరు మెరుపు గెలుపు
6 వికెట్లతో గుజరాత్ జెయింట్స్ పరాజయం
ఆర్‌సీబీని గెలిపించిన రిచా, పెరీ
గార్డ్‌నర్ ప్రదర్శన వృథా
‘పరుగుల వరద ఖాయం’... టాస్ సమయంలో విశ్లేషకురాలు మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్య ఇది. ఆమె చెప్పినట్లుగానే డబ్ల్యూపీఎల్ తొలి పోరులో 400కు పైగా పరుగులు నమోదయ్యాయి. ఇరు జట్లూ భారీ షాట్లతో విరుచుకుపడి పూర్తి వినోదాన్ని పంచాయి. ముందుగా ఆష్లీ గార్డ్‌నర్, బెత్ మూనీ మెరుపులు గుజరాత్‌కు భారీ స్కోరును అందిస్తే రిచా ఘోష్, ఎలైస్ పెరీ తమ ఆటతో అదరగొట్టారు. ఫలితంగా లీగ్‌లో అత్యధిక పరుగుల ఛేదనతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) శుభారంభం చేసింది.
వడోదర: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు రికార్డు లక్ష్య ఛేధనతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం జరిగిన తొలి పోరులో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (37 బంతుల్లో 79 నాటౌట్; 3 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, బెత్ మూనీ (42 బంతుల్లో 56; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించింది.
అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఎలైస్ పెరీ (34 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేయగా, కనిక ఆహుజా (13 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు) రాణించింది. రిచా, కనిక ఐదో వికెట్‌కు 37 బంతుల్లోనే అభేద్యంగా 93 పరుగులు జత చేశారు.
సిక్స్‌ల జోరు...
ఓపెనర్ మూనీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా... మరో ఎండ్‌లో 6 పరుగుల వ్యవధిలో వోల్‌వార్ట్ (6), హేమలత (4) వెనుదిరిగారు. అయితే మూనీ దూకుడు కొనసాగించింది. వేర్‌హామ్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన ఆమె 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మూనీ వెనుదిరిగిన తర్వాత గార్డ్‌నర్ విధ్వంసం మొదలైంది. ప్రేమ ఓవర్లో ఆమె వరుసగా మూడు సిక్స్‌లు బాదింది.
డియాండ్రా డాటిన్ (13 బంతుల్లో 25; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా జోరు ప్రదర్శించడంతో గుజరాత్ స్కోరు దూసుకుపోయింది. 25 బంతుల్లోనే గార్డ్‌నర్ హాఫ్ సెంచరీని అందుకుంది. జోషిత వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కూడా గార్డ్‌నర్ 3 సిక్స్‌లతో చెలరేగింది. చివరి రెండు బంతుల్లో హర్లీన్ 2 ఫోర్లు బాది స్కోరును 200 దాటించింది.
కీలక భాగస్వామ్యం...
భారీ లక్ష్య ఛేదనలో 14 పరుగులకే తొలి 2 వికెట్లు కోల్పోయి ఆర్‌సీబీ ఇబ్బందుల్లో పడింది. ఒకే ఓవర్లో కెప్టెన్ స్మృతి మంధాన (9), డానీ వ్యాట్ (4)లను గార్డ్‌నర్ వెనక్కి పంపించింది. ఈ దశలో పెరీ, రాఘ్వీ బిష్త్ (27 బంతుల్లో 25; 3 ఫోర్లు) భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది.
ముఖ్యంగా పెరీ తన అనుభవంతో కొన్ని చక్కటి షాట్లు ఆడగా, తొలి డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడుతున్న రాఘ్వీ అండగా నిలిచింది. 19 పరుగుల వద్ద హర్లీన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పెరీ 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. మూడో వికెట్‌కు 55 బంతుల్లో 86 పరుగులు జోడించిన పెరీ, రాఘ్వీ తక్కువ వ్యవధిలో అవుటయ్యారు.
బెంగళూరు విజయం కోసం 46 బంతుల్లో 93 పరుగులు చేయాల్సిన ఈ స్థితిలో గుజరాత్‌దే పైచేయిగా కనిపించింది. కానీ రిచా, కనిక భాగస్వామ్యం అసాధారణ ఆటతో జట్టును గెలిపించింది. ‘0’ వద్ద రిచా ఇచ్చిన క్యాచ్‌ను సిమ్రన్ వదిలేయడం కూడా బెంగళూరు జట్టుకు కలిసొచ్చింది.
ఒకే ఓవర్లో 23 పరుగులు...
ఆర్‌సీబీ 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సి ఉండగా గార్డ్‌నర్ వేసిన 16వ ఓవర్ ఆటను పూర్తిగా మలుపు తిప్పింది. ఈ ఓవర్లో రిచా ఏకంగా 4 ఫోర్లు, 1 సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ప్రియ ఓవర్లో కూడా 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టిన రిచా 23 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించింది. అనంతరం డాటిన్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో రిచా మ్యాచ్‌ను ముగించడం విశేషం.
స్కోరు వివరాలు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మూనీ (సి) స్మృతి (బి) ప్రేమ 56; వోల్‌వార్ట్ (బి) రేణుక 6; హేమలత (సి) ప్రేమ (బి) కనిక 4; ఆష్లీ గార్డ్‌నర్ (నాటౌట్) 79; డాటిన్ (సి) వ్యాట్ (బి) రేణుక 25; సిమ్రన్ (బి) వేర్‌హమ్ 11; హర్లీన్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–35, 2–41, 3–85, 4–152, 5–182. బౌలింగ్: రేణుక 4–0–25–2, కిమ్ గార్త్ 4–0–34–0, జోషిత 4–0–43–0, కనిక 3–0–19–1, వేర్‌హామ్ 3–0–50–1, ప్రేమ 2–0–26–1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్‌నర్ 9; డానీ వ్యాట్ (బి) గార్డ్‌నర్ 4; పెరీ (సి) వోల్‌వార్ట్ (బి) సయాలీ 57; రాఘ్వీ (సి) సయాలీ (బి) డాటిన్ 25; రిచా ఘోష్ (నాటౌట్) 64; కనిక (నాటౌట్) 30; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 202.
వికెట్ల పతనం: 1–13, 2–14, 3–100, 4–109. బౌలింగ్: కాశ్వీ 2–0–22–0, గార్డ్‌నర్ 3–0–33–2, డాటిన్ 3.3–0– 41–1, తనూజ 3–0–29–0, సయాలీ 4–0–44–1, ప్రియ 3–0–29–0.
Comments
Please login to add a commentAdd a comment