వన్డే ప్రపంచకప్ 2023లో వరుణుడు బోణీ కొట్టాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్ 29) జరగాల్సిన వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. తిరువనంతపురంలో ఇవాల్టి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు. మైదానం చిన్న సైజు చెరువులా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, వ్యక్తిగత కారణాల చేత సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా స్వదేశానికి తిరిగి వెళ్లడంతో వార్మప్ మ్యాచ్‌లకు ఎయిడెన్ మార్క్రమ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. బవుమా వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్ సమయానికంతా జట్టుతో చేరతాడని సమాచారం. సౌతాఫ్రికా తమ వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు శ్రీలంకను ఢీకొంటారు.
దీనికి ముందు ఆ జట్టు మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 2న సఫారీలు ఇదే తిరువనంతపురంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 7న ఆడనుంది. ధర్మశాలలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు.. బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీనికి ముందు ఆఫ్ఘన్ టీమ్ మరో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 3న వీరు గౌహతిలో శ్రీలంకను ఢీకొంటారు.
ఇదిలా ఉంటే, ఇవాళే మరో రెండు వార్మప్ మ్యాచ్‌లు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్.. గౌహతిలో శ్రీలంక-బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బాబర్ ఆజమ్ (41), మొహమ్మద్ రిజ్వాన్ (34) క్రీజ్‌లో ఉన్నారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. 28 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అసలంక (18), ధనంజయ డిసిల్వ (17) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment