వన్డే ప్రపంచకప్-2023కి ముందు న్యూజిలాండ్ టీమ్ అన్ని జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వరుసగా రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో 300 ప్లస్ స్కోర్లు చేసి తమతో జాగ్రత అనే సందేశాన్ని పంపింది. వరుసగా రెండు పర్యాయాలు దెబ్బతిన్నాం.. ఈసారి వదిలేది లేదని ప్రపంచకప్ ఆశావాధులకు హెచ్చరికలు జారీ చేసింది.
పాక్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో 346 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఊదేసిన కివీస్ బ్యాటర్లు ప్రత్యర్ధి జట్లకు దడ పుట్టిస్తున్నారు. ఇవాళ (అక్టోబర్ 2) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వార్మప్ మ్యాచ్‌లోనూ రెచ్చిపోయిన కివీస్ బ్యాటర్లు ప్రత్యర్ధి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తూ కివీస్ 321 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లు ఇంత అలవోకగా పరుగులు చేస్తుంటే భారత్ సహా అన్ని జట్లు కలవరపడుతున్నాయి.
ఈసారి కివీస్ నుంచి ముప్పుతప్పేలా లేదని నిర్ధారణకు వచ్చాయి. కివీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు అన్ని జట్లు అస్త్రాలను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి. కేన్ విలియమ్సన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్రలను కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేన్ మామపై అన్ని జట్లు ప్రత్యేక నిఘా పెట్టాయి.
బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో కివీస్‌కు మొదటినుంచి పటిష్టంగా ఉంది. ఆ జట్టులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అంటే అవి బ్యాటింగ్‌లోనే. ఇప్పుడు అదే బ్యాటింగ్‌లో కివీస్ ఇరగదీస్తుంటే ప్రత్యర్ధి జట్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. భీకర ఫామ్‌లో ఉన్న బౌల్ట్, మ్యాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్‌లతో కివీస్ పేస్ విభాగం బలంగా ఉంది.
మిచెల్ సాంట్నర్, ఐష్ సోధి, రచిన్ రవీంద్రతో స్పిన్ విభాగం కూడా పటిష్టంగా ఉంది. ఇక వీరి ఫీల్డింగ్ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్ క్లాస్ ఫీల్డర్లంతా ఈ జట్టులోనే ఉన్నారు. అన్ని విభాగాల్లో ఇంత పటిష్టంగా ఉన్న ఈ జట్టును ప్రపంచకప్‌లో అన్ని జట్లు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.
సౌతాఫ్రికాతో వార్మప్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. కాన్వే (78), టామ్ లాథమ్ (52) అర్ధసెంచరీలతో రాణించగా... విలియమ్సన్ (37), గ్లెన్ ఫిలిప్స్ (43), డారిల్ మిచెల్ (25), మార్క్ చాప్‌మన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, జన్సెన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్‌లోనే షాకిచ్చాడు. రీజా హెండ్రిక్స్ తొలి బంతికే బౌల్ట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment