WPL 2023 MI Vs RCB: Mandhana takes responsibility after another loss - Sakshi
Sakshi News home page

Smriti Mandhana: కోహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తున్నావంటూ ట్రోల్స్‌! ఓటమికి ప్రధాన కారణం అదే.. అయినా!

Published Tue, Mar 7 2023 11:25 AM | Last Updated on Tue, Mar 7 2023 12:23 PM

WPL 2023 MI Vs RCB: Mandhana Takes Responsibility After Another Loss - Sakshi

కోహ్లి- స్మృతి (PC: RCB/ BCCI)

Same Results Memes Trolls On RCB: ‘‘మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. మెరుగైన స్కోరు నమోదు చేయాల్సింది. ఓటమిని అంగీకరించకతప్పదు. అయితే, కచ్చితంగా లోపాలు సరిదిద్దుకుని తిరిగి పుంజుకుంటాం. నిజానికి నాతో సహా ఇద్దరు- ముగ్గురు బ్యాటర్లు కనీసం 20 పరుగులు చేయగలిగారు. కానీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాం. నిజం చెప్పాలంటే.. మా బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది. 6-7 మంచి ఆప్షన్లు ఉన్నాయి.

కానీ బ్యాటర్లు మెరుగైన స్కోరు నమోదు చేయనపుడు వారు మాత్రం ఏం చేయగలుగుతారు. కాబట్టి ఇందుకు వాళ్లను బాధ్యులను చేయడం సరికాదు. ఫ్రాంఛైజ్‌ క్రికెట్‌లో మనకు శుభారంభాలు లభించినా.. మ్యాచ్‌ గెలుస్తున్నామనిపించినా.. ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందో అంచనా వేయలేం.

అయితే, ఈ రోజు మ్యాచ్‌లో టాపార్డర్‌ విఫలమైన వేళ కనిక, శ్రియాంక బ్యాటింగ్‌ చేసిన తీరు మాకు అత్యంత సానుకూల అంశం. వాళ్ల ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా’’ అని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన పేర్కొంది. ముంబై ఇండియన్స్‌ వుమెన్‌తో పోరులో ఓటమికి బాధ్యత వహించిన స్మృతి.. బ్యాటర్ల వైఫల్యమే పరాజయానికి ప్రధాన కారణమని తెలిపింది.


PC: RCB

కాగా మహిళా ప్రీమియర్‌ లీగ్‌-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయిన విషయం తెలిసిందే. ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ స్మృతి మంధాన 23, వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ 28, లోయర్‌ ఆర్డర్‌లో కనికా అహుజా 22, శ్రియాంక పాటిల్‌ 23, మేగన్‌ షట్‌ 20 పరుగులు చేయగలిగారు.

మిగిలిన వాళ్లు కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆర్సీబీ ఆలౌట్‌ అయింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 14.2 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి టార్గెట్‌ ఛేదించింది. ముంబై ఓపెనర్‌ హేలీ మాథ్యూస్‌ 77 పరుగులతో అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్‌ యస్తికా భాటియా 23 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ నటాలీ సీవర్‌- బ్రంట్‌ 55 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన హేలీ మాథ్యూస్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకుంది.

ఇక వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడటంతో ఆర్సీబీపై సోషల్‌ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇక ఆర్సీబీ రాత మారదని, కోహ్లి వారసత్వాన్ని స్మృతి కొనసాగిస్తుందంటూ మీమ్స్‌తో ట్రోల్‌ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్‌ ఇందుకు ధీటుగానే బదులిస్తున్నారు. కేవలం రెండు మ్యాచ్‌లతో అంచనా వేయొద్దని హితవు పలుకుతున్నారు. ఇక స్మృతి సేన మార్చి 8న గుజరాత్‌తో తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.

చదవండి: WPL 2023 GG Vs RCB: మహిళా దినోత్సవ కానుక.. బీసీసీఐ బంపరాఫర్‌.. అందరికీ ఉచిత ప్రవేశం!
Shubman Gill: ఊహించని ట్విస్ట్‌ ఇచ్చిన గిల్‌.. సారా అలీఖాన్‌ కాదు! ఆమే నా క్రష్‌ అంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement