
న్యూఢిలీ: డబ్ల్యూటీసీ ఫైనల్ ఆఖరి రోజు ఆట ఉత్కంఠగా సాగుతున్న సమయంలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉన్నపళంగా మైదానం వీడి వెళ్లిపోవడంపై పలు రకాల ఊహాగానాలు వెలువడ్డాయి. 139 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టుని కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ విజయతీరాలకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో టీమిండియా.. వికెట్ కీపర్‌ని మార్చడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పంత్ స్థానంలో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వచ్చి నాలుగు ఓవర్ల పాటు కీపింగ్ చేశాడు. దీంతో పంత్‌కు ఏమైంది..?, సాహా ఎందుకు కీపింగ్ చేస్తున్నాడు..? అని తెలుసుకునేందుకు అభిమానులు, నెటిజన్లు తెగ ఆరాటపడ్డారు.
ఈ నేపథ్యంలో పంత్ మైదానం వీడడానికి గల కారణాన్ని ఐపీఎల్ ప్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్ వెల్లడించింది. ఆ సమయంలో పంత్ ఒంట్లో కాస్త నలతగా ఉండటంతో అతని స్థానంలో సాహా కీపింగ్ చేశాడని డీసీ ట్వీట్ చేసింది. కాగా, ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియాపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేశాడు. డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తో పాటు ఐసీసీ గద (ట్రోఫీ) లభించగా, రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.
చదవండి: WeWantANewCaptain: సమయం ఆసన్నమైంది కోహ్లీ.. దిగిపో
Comments
Please login to add a commentAdd a comment