ఢిల్లీ జెర్సీలో రిషభ్ పంత్ (PC: IPL/BCCI)
‘‘ఢిల్లీ క్యాపిటల్స్‌తో నా ప్రయాణం ఒక అద్భుతం. మైదానంలో ఎన్నెన్నో ఉత్కంఠభరిత క్షణాలు.. మరెన్నో మధుర జ్ఞాపకాలు. ఓ టీనేజర్‌గా ఇక్కడికి వచ్చాను. ఢిల్లీ క్యాపిటల్స్‌తో కలిసి ఈ తొమ్మిదేళ్లలో నేనూ ఎంతో ఎత్తుకు ఎదిగాను. నేనిది ఎన్నడూ ఊహించలేదు.
నా ప్రయాణం ఇంత ప్రత్యేకంగా మారడానికి ప్రధాన కారణం అభిమానులు. నన్ను అక్కున చేర్చుకున్నారు. నా జీవితంలోని కఠిన సమయంలో నాకు అండగా నిలబడ్డారు. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాను.
అయితే, నాపై మీకున్న ప్రేమాభిమానాలను బరువైన హృదయంతో మోసుకెళ్తున్నాను. నేను ఎక్కడ ఉన్నా.. నా ఆటతో మీకు వినోదం అందిస్తాను. నన్ను కుటుంబ సభ్యుడిగా ఆదరించినందుకు.. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మలిచినందుకు ధన్యవాదాలు.. ఏదేమైనా వీడ్కోలు చెప్పడం అంత సులువేమీ కాదు’’ అంటూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు.
వీడలేక వీడిపోతున్నట్లు..
ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడలేక వీడిపోతున్నట్లు తన మనసులో ఉన్న మాటలను లేఖ రూపంలో వెల్లడించాడు. కాగా ఐపీఎల్- 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంఛైజీ పంత్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆక్షన్‌లోకి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ ఆది నుంచి ఆసక్తి చూపింది.
అయితే, పంత్ ధర రూ. 20 కోట్లకు చేరుకున్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ తమ రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవాలని చూసింది. కానీ లక్నో మాత్రం వెనక్కి తగ్గలేదు. అమాంతం ఏడు కోట్లు పెంచి మొత్తంగా రూ. 27 కోట్లకు రిషబ్ పంత్‌ను తమ సొంతం చేసుకుంది. దీంతో వచ్చే ఏడాది పంత్ లక్నోకు ఆడబోతున్నాడు.
ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధం
కాగా పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. 2016లో ఢిల్లీ జట్టుతో తన ఐపీఎల్ జర్నీ ఆరంభించిన పంత్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. 2017లో 366 పరుగులు మాత్రమే చేసిన అతడు.. 2018లో మాత్రం దుమ్ములేపాడు. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 684 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు ఫిప్టీలు ఉండటం విశేషం.
ఇక 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ఐపీఎల్-2023 మొత్తానికి దూరమయ్యాడు. ఆ సమయంలోనూ అభిమానులతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ అతడికి అండగా ఉంది. అయితే, వేలానికి ముందు అభిప్రాయ భేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆ ఫ్రాంఛైజీతో పంత్ బంధం ముగిసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది రీఎంట్రీ ఇచ్చి పంత్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 446 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా జట్టును ఆరో స్థానంలో నిలపగలిగాడు.
చదవండి: IPL Auction 2025: అతడికి ఏకంగా రూ. 18 కోట్లు.. కారణం మాత్రం కావ్యానే!.. పాపం ప్రీతి!
Comments
Please login to add a commentAdd a comment