India tour of Bangladesh, 2022 - Bangladesh vs India, 1st Test: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2021-23 సీజన్‌లో భాగంగా బంగ్లాదేశ్- టీమిండియా మధ్య బుధవారం(డిసెంబరు 14) తొలి టెస్టు ఆరంభమైంది. ఛటోగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఛతేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్.
ఇక ఈ మ్యాచ్‌లో నెగ్గి శుభారంభం చేస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ దిశగా వెళ్లేందుకు టీమిండియాకు మార్గం సుగమమవుతుంది. బంగ్లాతో మొదటి టెస్టులో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కగా... స్పిన్ ఆల్‌రౌండర్లు అశ్విన్, అక్షర్ పటేల్ స్థానం దక్కించుకున్నారు. రిషభ్ పంత్ వికెట్ కీపర్‌గా బరిలోకి దిగడంతో తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు పేసర్లు ఉమేశ్ యాదవ్, సిరాజ్‌తో బరిలోకి దిగింది. శుబ్‌మన్ గిల్‌తో కలిసి రాహుల్ ఓపెనింగ్‌కు వచ్చాడు.
తుది జట్లు ఇవే
టీమిండియా: శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్
బంగ్లాదేశ్
జాకిర్ హసన్, నజ్ముల్ హొసేన్ షాంటో, లిటన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీం, యాసిర్ అలీ, నూరుల్ హసన్(వికెట్ కీపర్), మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఇబాదత్ హొసేన్.
చదవండి: Lionel Messi: ఫైనల్లో అర్జెంటీనా.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ! వారెవ్వా.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో
FIFA World Cup Qatar 2022 Semi-Final: అందరి కళ్లు మొరాకో పైనే...
అలా అయితేనే ముందుకు..
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించేందుకు భారత్‌కు ఆరు టెస్టు మ్యాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కనీసం ఐదు గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా ముందంజ వేస్తుంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల్లో తలపడటానికి ముందు బలహీన బంగ్లాదేశ్‌పై చెలరేగి సాధ్యమైనన్ని ఎక్కువ పాయింట్లు ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది.
అయితే సొంతగడ్డపై ఇటీవలే మన జట్టును వన్డే సిరీస్‌లో ఓడించి ఊపు మీదున్న బంగ్లాదేశ్ ఎలాంటి పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఈ నేపథ్యంలో నేటి నుంచి తొలి టెస్టుకు రంగం సిద్ధమైంది.
రోహిత్ శర్మ అనూహ్యంగా గాయంతో దూరం... బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలాంటి సీనియర్ బౌలర్లు అందుబాటులో లేరు... ఇటీవల పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తడబడుతున్న కేఎల్ రాహుల్ ఇప్పుడు బ్యాటింగ్‌తో పాటు కెపె్టన్సీలో రాణించాల్సిన అవసరం... ఇలాంటి పరిస్థితుల మధ్య భారత జట్టు బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో తలపడుతోంది. వన్డే సిరీస్ ఫలితం చూసిన తర్వాత బంగ్లాను తేలిగ్గా తీసుకోరాదనే విషయం స్పష్టమైంది.
ప్రధానంగా సీనియర్ ఆటగాళ్లను నమ్ముకున్న బంగ్లా టెస్టుల్లో భారత్‌ను ఇప్పటి వరకు ఓడించకపోయినా... సంచలనానికి సై అంటోంది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై ఆట సాగుతున్న కొద్దీ స్పిన్ ప్రభావం చూపిస్తుంది.
సీనియర్లపైనే భారం...
వన్డేలు, టి20ల్లో సొంతగడ్డపై ఘనమైన రికార్డు ఉన్నా... గత కొంత కాలంగా బంగ్లాదేశ్‌కు సొంతగడ్డపై టెస్టులు మాత్రం అచ్చి రాలేదు. 2021 జనవరి నుంచి ఆరు టెస్టులు ఆడిన ఆ జట్టు 5 ఓడిపోయి, ఒకటి ‘డ్రా’ చేసుకోగలిగింది. అయితే ఇటీవల పరిమిత ఓవర్ల ప్రదర్శన జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేయలేని పరిమిత బౌలింగ్ వనరులు ఉన్నా, బ్యాటింగ్ బలంతో జట్టు కాస్త మెరుగ్గా కనిపిస్తోంది.
షకీబ్, దాస్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా, బంగ్లా దేశవాళీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన జాకీర్ హసన్ ఓపెనర్‌గా అరంగేట్రం చేయనున్నాడు. ఇబాదత్, ఖాలెద్, షరీఫుల్ పేస్ బౌలింగ్ భారం మోస్తుండగా, ప్రధాన స్పిన్నర్లు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్ భారత్‌ను ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఇక భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 11 టెస్టులు జరిగాయి. భారత్ 9 టెస్టుల్లో గెలుపొందగా... రెండు ‘డ్రా’గా ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment