ఫైల్ ఫోటో
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25లో టీమిండియా బోణీ కొట్టింది. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు తలపడతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డొమినికా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన రోహిత్ సేన.. అతిథ్య విండీస్‌ను చిత్తు చేసింది. 312/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మెుదలెపెట్టిన భారత్.. 425/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగుల అధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన కరీబియన్ జట్టు.. అశ్విన్ మాయాజాలంతో 130 పరుగులకే కుప్పకూలింది.
దీంతో భారత్‌కు ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ విజయం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
అరంగేట్ర టెస్టులోనే సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌పై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ తన తొలి టెస్టులో 171 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 229 పరుగుల భారీ బాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
"తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మేము ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాం. ముఖ్యంగా బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే వారు బంతితో అద్భుతంగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకే అతిథ్య జట్టును కట్టడి చేశారు. ఇటువంటి పిచ్‌పై కేవలం ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేయాలని మేము ముందే నిర్ణయించుకున్నాం.
అందుకే 400 పరుగుల మార్క్‌ను దాటగానే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాం. ఆ తర్వాత మా బౌలర్లు వారు పనిని పూర్తి చేశారు. అశ్విన్, జడేజా మ్యాచ్‌ను తిప్పేశారు. గతంలోనూ ఈ ద్వయం మాకు చాలా విజయాలు అందించారు. ముఖ్యంగా అశ్విన్ అయితే తన క్లాస్‌ను మరోసారి చూపించాడు. ఇక యువ సంచలనం జైశ్వాల్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే.
అతడు ఎంటో మనం గతంలోనే చూశాం. కానీ దేశం కోసం ఈ తరహా ఇన్నింగ్స్ ఆడటం గర్వించదగ్గ విషయం. అతడు తన తొలి మ్యాచ్ ఆడుతున్నట్లు లేదు, ఏదో వందో మ్యాచ్ ఆడుతున్నట్లు బ్యాటింగ్ చేశాడు. కొంచెం కూడా అతడిలో భయం కనిపించలేదు. అతడి నిబద్దతకు నేను ఫిదా అయిపోయాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్ (103) కూడా సెంచరీ సాధించాడు.
చదవండి: IND vs WI: చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. 13 ఏళ్ల సురేష్ రైనా రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment