West Indies vs India, 2nd Test Day 5: వెస్టిండీస్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఐదో రోజు ఆటకు వరణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆఖరి రోజు ఆట ఆలస్యంగా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. వాన తెరిపి ఇవ్వడంతో అంపైర్లు మైదానంలోకి వెళ్లి ఆట కొనసాగించే వీలుందా అని పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. కాగా వర్షం వల్ల మొదటి సెషన్ తుడిచిపెట్టుకుపోయింది. లంచ్ బ్రేక్ దాకా ఆట మొదలుకాలేదు.
కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత జట్టు డొమినికా టెస్టులో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా విండీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించడం... ఆపై అరంగేట్ర ఓపెనర్ యశస్వి జైశ్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. జూలై 12న మొదలైన మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించి.. ఏకంగా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ క్రమంలో జూలై 20న ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మొదలైంది. ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో గల క్వీన్స్ పార్క్ ఓవల్ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 438 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇందుకు బదులుగా కరేబియన్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్ చెరో రెండు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఇక 183 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోహిత్ సేన.. 181-2 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు సాధించింది. వెస్టిండీస్ ఓపెనర్లరిద్దరి వికెట్లను అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ నుంచి తప్పించుకోవాలంటే ఆఖరి రోజు విండీస్ 289 పరుగులు చేయాలి. అదే విధంగా రోహిత్ సేన 2-0తో విజయం సంపూర్ణం చేసుకోవాలంటే 8 వికెట్లు పడగొట్టాలి. వర్షం తెరిపిఇవ్వకపోతే మాత్రం ఇరు జట్ల ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది.
చదవండి: Ind vs WI: వాళ్లిద్దరు ఉంటే అంతే! మ్యాచ్ డ్రా అయినా చాలనుకుంటే మాత్రం..
Comments
Please login to add a commentAdd a comment