నొంతాబురి (థాయ్‌లాండ్): గత ఏడాది ఏకంగా ఆరు ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్స్ సాధించి అదరగొట్టిన సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ కొత్త ఏడాదిలో ఆడిన రెండో టోర్నీలోనే టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ ఢిల్లీకి చెందిన తన సహచరుడు యూకీ బాంబ్రీతో కలిసి విజేతగా నిలిచాడు. గంటా 50 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్–యూకీ జోడీ 2–6, 7–6 (9/7), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)–అకీరా సాంటిలాన్ (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచింది.
చాంపియన్‌గా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 4,645 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 77 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా టైటిల్‌తో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సాకేత్ తొమ్మిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 74వ ర్యాంక్‌కు, యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 90వ ర్యాంక్‌కు చేరుకుంటారు. తదుపరి సాకేత్–యూకీ జోడీ సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగనుంది.
Comments
Please login to add a commentAdd a comment