ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 17) జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే వర్షం మొదలైంది. అయితే మధ్యలో వరుణుడు కాసేపు శాంతించడంతో 28 ఓవర్ల మ్యాచ్‌గా కుదించారు. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
సామ్ కర్రన్ సోదరుడు అరంగేట్రం
ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ పెద్ద సోదరుడు బెన్ కర్రన్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. బెన్ తన తండ్రి దేశమైన జింబాబ్వే తరఫున తన తొలి వన్డే ఆడాడు. ఈ మ్యాచ్‌లో బెన్ 22 బంతులు ఎదుర్కొని ఓ బౌండరీ సాయంతో 15 పరుగులు చేశాడు. అనంతరం బెన్ అజ్మతుల్లా బౌలింగ్‌లో ఇక్రమ్ అలీఖిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
నిప్పులు చెరిగిన ఒమర్‌జాయ్
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. ఆఫ్ఘనిస్తాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ నిప్పులు చెరగడంతో విలవిలలాడిపోయింది. ఒమర్‌జాయ్ ధాటికి జింబాబ్వే 41 పరుగులకు సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఒమర్‌జాయ్ 4.2 ఓవర్లలో 18 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
జింబాబ్వే స్కోర్ 44/5 వద్ద నుండగా (9.2 ఓవర్లు) వర్షం మళ్లీ మొదలైంది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బెన్ కర్రన్ 15, మరుమణి 6, బ్రియాన్ బెన్నెట్ 0, డియాన్ మైర్స్ 12, సీన్ విలియమ్స్ 0 పరుగులకు ఔట్ కాగా.. కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (1),సికందర్ రజా (1) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment