
అబుదాబి: అప్ఘనిస్తాన్, జింబాబ్వే మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్ఘన్ ఆటగాడు హస్మతుల్లా షాహిది చేసిన తప్పిదం జింబాబ్వే జట్టుకు ఒక అదనపు పరుగు వచ్చేలా చేసింది. విషయంలోకి వెళితే.. మూడో రోజు ఆటలో భాగంగా మూడో సెషన్‌లో జింబాబ్వే 8వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఆడుతుంది. క్రీజులో సికందర్ రజా 79, ముజరబనీ 0 పరుగులతో ఉన్నారు.
ఇన్నింగ్స్ 90వ ఓవర్ చివరి బంతిని షిర్జాద్ యార్కర్ వేయగా.. రజా దానిని కవర్స్ దిశగా ఆడాడు. కవర్స్‌లో ఉన్న హస్మతుల్లా బంతిని అందుకొని బౌండరీ లైన్ ఆవల తన పాదాన్ని ఉంచాడు. రూల్ ప్రకారం ఒక ఆటగాడు బంతి చేతిలో ఉండగా బౌండరీ లైన్ దాటితే.. దానిని ఫోర్‌గా భావిస్తారు. కానీ ఇక్కడ హస్మతుల్లా కావాలనే అలా చేశాడని వీడియోలో కనిపించింది. ఆఖరి బంతికి సింగిల్ లేదా మూడు రన్స్ వస్తే రజా స్ట్రైక్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇలా ఆలోచించిన హస్మతుల్లా రజాకు స్ట్రైక్ రాకూడదనే ఉద్దేశంతో.. తర్వతి ఓవర్‌లో స్ట్రైకింగ్‌కు వచ్చే ముజరబనీ ఔట్ చేసే అవకాశం ఉంటుందని భావించాడు. దీంతో అంపైర్లు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఐసీసీ నిబంధనల్లోని రూల్ 19.8 ప్రకారం.. స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ ఆడిన షాట్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ప్రత్యర్థి జట్టుకు అదనంగా ఒక పరుగు ఇస్తారు. అలా జింబాబ్వే జట్టుకు అదనపు పరుగు రావడంతో పాటు.. తదుపరి ఓవర్‌లో రజా స్ట్రైక్‌లోకి వచ్చాడు.
ఆ తర్వాతి ఓవర్ వేసిన రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రజా ఔట్ కావడంతో జింబాబ్వే 287 పరుగులకు ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. ప్రస్తుతం నాలుగో రోజు లంచ్ విరామం ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ పరాజయం నుంచి తప్పించుకోవాలంటే ఆ జట్టు ఇంకా 157 పరుగులు చేయాల్సి ఉంది. అంతకముందు అఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 545 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది.
చదవండి:
పట్టించుకోని ఆర్చర్.. షాక్ తిన్న మొయిన్ అలీ
వారెవ్వా రాహుల్.. నీ విన్యాసం అదుర్స్