తొలి టీ20లో జింబాబ్వే చేతిలో ఎదురైన పరాభవానికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే వేదికగా ఇవాళ (డిసెంబర్ 13) జరిగిన రెండో టీ20లో ఆఫ్ఘనిస్తాన్.. జింబాబ్వేపై 50 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ జట్లు 1-1తో సమానంగా నిలిచాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. దర్విష్ రసూలీ (58) అర్ద సెంచరీతో రాణించగా.. అజ్మతుల్లా (28), గుల్బదిన్ (26 నాటౌట్), సెదికుల్లా అటల్ (18), గుర్బాజ్ (11) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. జింబాబ్వే బౌలర్లలో ట్రెవర్ గ్వాండు, ర్యాన్ బర్ల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ముజరబానీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
154 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఆఫ్ఘన్ బౌలర్లు మూకుమ్మడిగా విజృంభించడంతో 17.4 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. ముజీబ్ ఉర్ రెహ్మాన్ 2, ఒమర్‌జాయ్, ఫరీద్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (35) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రియాన్ బెన్నెట్ (27), తషింగ ముసేకివా (13) రెండంకెల స్కోర్లు చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మకమైన మూడో టీ20 డిసెంబర్ 14న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment