IPL 2025: విశాఖలో అశుతోష్‌ ‘షో’ | IPL 2025: Delhi Capitals beats Lucknow Super Giants by 1 wicket | Sakshi
Sakshi News home page

IPL 2025: విశాఖలో అశుతోష్‌ ‘షో’

Mar 25 2025 4:37 AM | Updated on Mar 25 2025 4:37 AM

IPL 2025: Delhi Capitals beats Lucknow Super Giants by 1 wicket

31 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 66 నాటౌట్‌

లక్నోపై వికెట్‌ తేడాతో ఢిల్లీ విజయం

పూరన్, మార్ష్ మెరుపులు వృథా  

లక్నోతో మ్యాచ్‌లో 210 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ స్కోరు 113/6... మరో 45 బంతుల్లో 97 పరుగులు రావాలి. అశుతోష్, తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న విప్‌రాజ్‌ కలసి 22 బంతుల్లో 55 పరుగులు జోడించి ఆశలు రేపారు. మరో 42 పరుగులు చేయాల్సిన స్థితిలో విప్‌రాజ్‌ వెనుదిరగడంతో ఢిల్లీ గెలుపు కష్టమనిపించింది. 

కానీ అశుతోష్‌ మరోలా ఆలోచించాడు. తాను ఎదుర్కొన్న తర్వాతి 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 35 పరుగులు బాది జట్టును విజయతీరం చేర్చాడు. మూడు బంతులు మిగిలి  ఉండగానే గెలిపించి టీమ్‌ మెంటార్‌ పీటర్సన్‌ను అనుకరిస్తూ విజయనాదం చేశాడు. గెలుపునకు చేరువగా వచ్చి అనూహ్యంగా ఓడటంతో లక్నో కొత్త కెపె్టన్‌ పంత్‌లో తీవ్ర నిరాశ కనిపించింది.   

సాక్షి, విశాఖపట్నం: ఐపీఎల్‌లో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్‌ పైచేయి సాధించింది. సోమవారం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒక వికెట్‌ తేడాతో లక్నోపై చిరస్మరణీయ విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు), మిచెల్‌ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగారు. 

వీరిద్దరు రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 87 పరుగులు జోడించారు. అనంతరం ఢిల్లీ 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అశుతోష్‌ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించగా... విప్‌రాజ్‌ నిగమ్‌ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (22 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అండగా నిలిచారు.  

పంత్‌ విఫలం... 
లక్నో ఇన్నింగ్స్‌ను మార్ష్ దూకుడుగా మొదలు పెట్టగా, తడబడుతూ ఆడిన మార్క్‌రమ్‌ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్‌) ఆరంభంలోనే వెనుదిరిగాడు. అయితే మార్ష్, పూరన్‌ భాగస్వామ్యం ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించింది. వీరిద్దరు వరుస బౌండరీలతో చెలరేగి ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిక్యం కనబర్చారు. ఈ జోరులో 21 బంతుల్లోనే మార్ష్ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. మార్ష్ వెనుదిరిగిన అనంతరం వచ్చిన రిషభ్‌ పంత్‌ (6 బంతుల్లో 0) డకౌటై నిరాశపర్చాడు. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లక్నో 33 పరుగుల వ్యవధిలో  6 వికెట్లు చేజార్చుకుంది. అయితే చివరి రెండు బంతుల్లో డేవిడ్‌ మిల్లర్‌ (19 బంతుల్లో 27 నాటౌట్‌; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రెండు సిక్స్‌లు బాదడంతో స్కోరు 200 పరుగులు దాటింది.  

ఆ రెండు ఓవర్లు... 
లక్నో ఇన్నింగ్స్‌లో రెండు వేర్వేరు ఓవర్లు హైలైట్‌గా నిలిచాయి. తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన లెగ్‌స్పిన్నర్‌ విప్‌రాజ్‌ నిగమ్‌ వేసిన 7వ ఓవర్లో తొలి బంతికి మార్ష్ సిక్స్‌ కొట్టగా, అదే ఓవర్లో పూరన్‌ 3 సిక్సర్లు బాదడంతో మొత్తం 25 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పూరన్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రిజ్వీ వదిలేశాడు. స్టబ్స్‌ వేసిన 13వ ఓవర్లో పూరన్‌ పండగ చేసుకున్నాడు. తొలి బంతికి పరుగు రాకపోగా, తర్వాతి ఐదు బంతుల్లో అతను వరుసగా 6, 6, 6, 6, 4 కొట్టడం విశేషం. దాంతో మొత్తం 28 పరుగులు లభించాయి. 

అద్భుత పోరాటం... 
ఆరంభంలో ఢిల్లీ స్కోరు 7 పరుగులకు 3 వికెట్లు. దీని ప్రభావం తర్వాతి బ్యాటర్లపై పడింది. డుప్లెసిస్‌ (18 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (11 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు కొంత ప్రయతి్నంచారు. చేయాల్సిన రన్‌రేట్‌ బాగా పెరిగిపోతున్న దశలో లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు భారీ షాట్లతో పోరాడారు. దూకుడుగా ఆడి స్టబ్స్‌ ని్రష్కమించిన తర్వాత గెలుపు కష్టమే అనిపించినా... అశుతోష్, నిగమ్‌ కలిసి సాధ్యం చేసి చూపించారు.  

స్కోరు వివరాలు  
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) స్టార్క్‌ (బి) నిగమ్‌ 15; మార్ష్ (సి) స్టబ్స్‌ (బి) ముకేశ్‌ 72; పూరన్‌ (బి) స్టార్క్‌ 75; పంత్‌ (సి) డుప్లెసిస్‌ (బి) కుల్దీప్‌ 0; మిల్లర్‌ (నాటౌట్‌) 27; బదోని (సి) స్టబ్స్‌ (బి) కుల్దీప్‌ 4; శార్దుల్‌ (రనౌట్‌) 0; షహబాజ్‌ (సి) (సబ్‌) విజయ్‌ (బి) స్టార్క్‌ 9; రవి బిష్ణోయ్‌ (బి) స్టార్క్‌ 0; దిగ్వేష్‌ రాఠీ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 209. 
వికెట్ల పతనం: 1–46, 2–133, 3–161, 4–169, 5–177, 6–177, 7–194, 8–194. 
బౌలింగ్‌: స్టార్క్‌ 4–0–42–3, అక్షర్‌ 3–0–18–0, విప్‌రాజ్‌ నిగమ్‌ 2–0–35–1, ముకేశ్‌ కుమార్‌ 2–0–22–1, కుల్దీప్‌ 4–0–20–2, మోహిత్‌ 4–0–42–2, స్టబ్స్‌ 1–0–28–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: జేక్‌ ఫ్రేజర్‌ (సి) బదోని (బి) శార్దుల్‌ 1; డుప్లెసిస్‌ (సి) మిల్లర్‌ (బి) బిష్ణోయ్‌ 29; పొరేల్‌ (సి) పూరన్‌ (బి) శార్దుల్‌ 0; రిజ్వీ (సి) పంత్‌ (బి) సిద్ధార్థ్‌ 4; అక్షర్‌ (సి) పూరన్‌ (బి) రాఠీ 22; స్టబ్స్‌ (బి) సిద్ధార్థ్‌ 34; అశుతోష్‌ (నాటౌట్‌) 66; విప్‌రాజ్‌ (సి) సిద్ధార్థ్‌ (బి) రాఠీ 39; స్టార్క్‌ (సి) పంత్‌ (బి) బిష్ణోయ్‌ 2; కుల్దీప్‌ (రనౌట్‌) 5; మోహిత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.3 ఓవర్లలో 9 వికెట్లకు) 211. 
వికెట్ల పతనం: 1–2, 2–2, 3–7, 4–50, 5–65, 6–113, 7–168, 8–171, 9–192. 
బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 2–0–19–2, సిద్ధార్థ్‌ 4–0–39–2, దిగ్వేశ్‌ రాఠీ 4–0–31–2, రవి బిష్ణోయ్‌ 4–0–53–2, ప్రిన్స్‌ యాదవ్‌ 4–0–47–0, షహబాజ్‌ అహ్మద్‌ 1.3–0–22–0.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement