వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి
నెల్లూరు: గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లో తాను సదరన్ రైల్వేలో డీఎస్పీ అంటూ కొద్దిరోజులుగా హల్‌చల్ చేస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి నిందితుడి వివరాలను వెల్లడించారు. వివరాలు..ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన మందా నాగరాజు ఆరు నెలలుగా గూడూరు ప్రాంతంలో నివాసం ఉంటూ తాను సదరన్ రైల్వేలో డీఎస్పీ అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఓ సెటిల్‌మెంట్‌కు సంబంధించి కొండంరెడ్డి రమేష్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి బాండ్ పేపర్‌పై బలవంతంగా సంతకాలు పెట్టించాడు.
పది రోజుల్లో రూ.10 లక్షలు ఇవ్వకపోతే ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నాగరాజును విచారించగా నకిలీ డీఎస్పీ అని తేలింది. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.5 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. నిందితుడు నాగరాజు రైల్వేలో లోకోపైలట్, ఆర్‌పీఎఫ్ డీఎస్పీ అని చెప్పుకుంటూ గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వలవేశాడు.
రైల్వే డిపార్ట్‌మెంట్‌లో టీసీ, క్లర్క్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి వారి నుంచి సుమారు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అతనిపై ఒంగోలు –1 టౌన్‌లో 2021లో చీటింగ్ కేసు నమోదై ఉందని చెప్పారు. నకిలీ రైల్వే డీఎస్పీ నుంచి నకిలీ యూనిఫామ్, ఐడీ కార్డులు, రైల్వే మెడికల్ ఫిట్‌నెస్, ఆర్‌ఆర్‌బీ సెలెక్షన్ సర్టిఫికెట్లు, రైల్వే పోలీసు క్యాప్‌తో పాటు వైర్‌సెల్ సెట్, ఫైబర్ లాఠీ, ఐదు సెల్‌ఫోన్లు, పల్సర్ బైక్, ల్యాప్‌టాప్, రూ.1.9లక్షల నగదుతో పాటు రూ.7 లక్షల విలువ చేసే రెండు ఖాళీ స్థలం డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ హజరత్‌బాబు, ఆర్‌పీఫ్ సీఐ లక్ష్మణరావు, ఏఎస్‌ఐ సీకేఎన్ రావు, ఒకటో పట్టణ ఎస్సై పవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment