
రోడ్డెక్కిన రైతాంగం
మంత్రుల సమీక్ష సాక్షిగా..
నెల్లూరు (పొగతోట): జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు మద్దతు ధర అంశాలపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించిన సమీక్ష సాక్షిగా అన్నదాతలు రోడ్డెక్కారు. మద్దతు ధర లభించడం లేదంటూ ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం, ఏపీ వ్యవసాయ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో రైతులు ఇందుకూరుపేట నుంచి కలెక్టరేట్ వరకు కాలినడకన ర్యాలీగా తరలివచ్చారు. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లతో సంబంధం లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలంటూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మంత్రుల సమీక్ష సమయంలోనే రైతు సంఘ నాయకులు ఆందోళనకు దిగడంతో కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. రైతులను ఎవరిని లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు రైతు సంఘ నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే మంత్రి రైతు సంఘ నాయకులతో ఈ సారికి సహకరించండి.. మీకు పూర్తి స్థాయిలో మేలు చేస్తామంటూ నచ్చ చెప్పారు. పదేపదే నాయకులు మద్దతు ధర లేదంటూ వివిధ కారణాలు చెప్పినా అవన్నీ వదిలేసేయండి ఈ సారికి మా ప్రభుత్వానికి సహకరించాలంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈ పంట పోర్టల్‌లో నమోదు చేయాలని, ఈకేవైసీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రిని కోరారు. రైతులకు గోనె సంచుల సమస్య లేకుండా ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లో నగదు వారి అకౌంట్లలో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తీసుకుపోయే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. తేమ శాతంలో తేడా లేకుండా తూకాల్లో మోసాలకు పాల్పడకుండా రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి ధాన్యం కొనుగోళ్లలో రైతాంగంతో పాటు మిల్లర్లను భాగస్వామ్యం చేస్తామన్నారు. రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో అందిస్తామని తెలిపారు.
మీడియాకు నో ఎంట్రీ
ధాన్యానికి మద్దతు, కొనుగోలు కేంద్రం ఏర్పాటు, రేషన్ బియ్యం సరఫరా తదితర అంశాలపై రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్ కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మీడియాను అనుమతించలేదు. రైతులకు ప్రయోజనాలు చేకూర్చే సమీక్షకు మీడియాకు అనుమతి ఇవ్వకపోవడం వివిధ అనుమానాలు తావిస్తోంది. అధికారులతో సమీక్ష సమావేశంలో లోటుపాట్లు, ఇతర అంశాలు బయట పడుతాయనే అనుమానంతో మీడియాను అనుమతించలేదని విమర్శలు ఉన్నాయి.
గిట్టుబాటు ధరల కోసం కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ఇందుకూరుపేట నుంచి భారీ ర్యాలీ
ఈ సారికి సహకరించాలంటూ
ప్రాధేయపడిన మంత్రి
పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు
24 గంటల్లో రైతుల అకౌంట్లో నగదు
అధికారులతో రాష్ట్ర మంత్రులు
నాదెండ్ల, ఆనం సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment