
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావమే చారిత్రాత్మకం
నెల్లూరు (బారకాసు): దేశ రాజకీయ యవనికపై వైఎస్సార్‌సీపీ ఆవిర్భావమే ఒక చారిత్రాత్మకం, ఉప ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు వైఎస్సార్‌సీపీ విజయాలు అప్రతిహతంగా కొనసాగాయని మాజీమంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరు నగరంలోని డైకస్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలో ఉన్న దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌కట్ చేసి అందరికి పంచి పెట్టారు. కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి ఆశీస్సులు, ఆదరణ అందించిన ప్రజానీకానికి, నాయకులు, కార్యకర్తలకు, సానుభూతిపరులు, వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ వత్సరంలోకి అడుగు పెట్టిందన్నారు. ఈ 14 ఏళ్ల పాటు పార్టీ అనేక ఒడిదొడుకులను ఎదుర్కొందన్నారు. ఇడుపులపాయలో 2011న మార్చి 12న మహానేత డాక్టర్ వైఎస్సార్ సమాధి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీతో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం ప్రతిపక్ష పార్టీగా, అధికార పార్టీగా నిలిచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. కోట్లాది మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, విలువలు, విశ్వసనీయత ఐదేళ్లు జగన్ పరిపాలన కొనసాగించారన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా వాడవాడల వైఎస్సార్‌సీపీ జెండా ఎగరడానికి కారణం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ప్రజల్లో ఉండే నమ్మకమేనని చెప్పారు. గడిచిన 9 నెలల్లోనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు వేయకుండా చంద్రబాబుకు ఓటు వేసి అధికారం ఇచ్చి తప్పు చేశామనే భావన ప్రజల్లో ఉందన్నారు. బాబు పాలన కంటే వైఎస్ జగన్ పాలన వెయ్యి రెట్లు మేలని వైఎస్సార్‌సీపీ వాళ్లే కాకుండా కరుడు కట్టిన టీడీపీ వాళ్లు మాట్లాడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0 పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అన్ని వర్గాల వారికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ వెంకటగిరి, ఉదయగిరి ఇన్‌చార్జిలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం నాయకురాలు మల్లి నిర్మల, కార్పొరేటర్ మొయిళ్ల గౌరి, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ఘనంగా ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
పార్టీ జెండా ఎగుర వేసిన నేతలు