
రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములు కావాలి
నెల్లూరు రూరల్: ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్ష కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత జిల్లా అటవీశాఖ అధికారి మహబూబ్‌బాషా పలు విషయాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాల విషయమై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అవసరమైన గ్రామాల్లో అధికారులు హాజరై భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఆర్డీఓలు అనూష, పావని, వంశీకృష్ణ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి పరిమళ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
17 నుంచి టెన్త్ పరీక్షలు
● హాజరుకానున్న 33,434 మంది విద్యార్థులు
నెల్లూరు(టౌన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు తెలిపారు. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా 33,434 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయన్నారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా 9 ఫ్లయింగ్, 24 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామన్నారు. విద్యార్థులు వారి హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం 83414 08109 ఫోన్ నంబర్‌తో కంట్రోలు రూంను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
పెద్దాస్పత్రిలో
డీఎంఈ ఆకస్మిక తనిఖీలు
● విధుల్లో లేని వారికి
షోకాజ్ నోటీసులివ్వాలని ఆదేశం
నెల్లూరు(అర్బన్): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అడ్మిన్) వెంకటేష్ గురువారం విజయవాడ నుంచి వచ్చి నెల్లూరులోని సర్వజన ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఓపీలు, క్యాజువాలిటీ, వార్డులు పరిశీలించారు. పలు ఓపీల్లో డాక్టర్లు లేక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. జూనియర్ డాక్టర్లు రోగులను పరిశీలిస్తున్నారు. విషయాన్ని అర్థం చేసుకున్న డీఎంఈ సంతకాలు చేసి విధుల్లో లేని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో లేని డాక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్‌ను ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగరాజమన్నార్, డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అధికారులు, హెచ్‌ఓడీలు, నర్సింగ్ సూపరింటెండెంట్‌లు, ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ వెంకటేష్ మాట్లాడుతూ డాక్టర్లు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా జమ అయిన నిధులను హెచ్‌డీఎస్ కమిటీకి నిబంధనల మేరకు తరలించి వాటిని కనీస సౌకర్యాల కోసం ఖర్చు చేసుకోవాలని సూచించారు. అనంతరం తమ, తమ విభాగాలకు కొరత ఉన్న పరికరాల గురించి డాక్టర్లు నివేదిక అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ నరేంద్ర, డాక్టర్ మస్తాన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములు కావాలి