
పొగాకు వేలం ప్రారంభం
● గరిష్ట ధర రూ.280
కలిగిరి: మండలంలోని కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభమైంది. తొలుత వేలం నిర్వహణాధికారి వి.మహేష్ కుమార్, రైతులు కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు 36 పొగాకు బేళ్లకు తీసుకొచ్చారు. మహేష్ కుమార్ కిలో పొగాకుకు రూ.306తో వేలం ప్రారంభించారు. ఆ ధరతో కంపెనీల ప్రతినిధులు కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో తగ్గిస్తూ వచ్చారు. కిలోకు గరిష్టంగా రూ.280 నుంచి కంపెనీల ప్రతినిధులు కొనుగోలు ప్రారంభించారు. మొత్తం 36 బేళ్లను కిలో ఆ మొత్తానికి కొనుగోలు చేశారు. 6 కంపెనీల ప్రతినిధులు వేలంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది పొగాకు పంట దిగుబడులు ఆశాజనంగా ఉన్నట్లు తెలిపారు. దిగుబడుల్లో 80 శాతం బ్రైట్ (హైగ్రేడ్), మీడియం గ్రేడ్ ఉత్పత్తి వచ్చిందన్నారు. పొగాకుకు మంచి ధరలు లభించే అవకాశం ఉందన్నారు. రైతులు గ్రేడ్ల వారీగా బేళ్లను తయారు చేసుకుని అమ్మకాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది, రైతు సంఘం అధ్యక్షుడు రావూరి శ్రీకాంత్‌బాబు, అన్నదాతలు పాల్గొన్నారు.
డీసీపల్లిలో..
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రారంభించారు. తొలిరోజు 18 బేళ్లు రాగా అన్నింటిని విక్రయించామని వేలం నిర్వహణాధికారి జి.రాజశేఖర్ తెలిపారు. గరిష్ట ధర రూ.280 లభించింది. 2,439 కిలోల పొగాకును విక్రయించగా రూ.6,83,144ల వ్యాపారం జరిగింది. 7 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

పొగాకు వేలం ప్రారంభం