
కొడుకు చేతిలో తండ్రి హతం
● మద్యం మత్తులో ఘాతుకం
● ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం
మర్రిపాడు: మద్యం మత్తులో తండ్రిని కుమారుడు హత్య చేసిన ఘటన మండలంలోని చుంచులూరు గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీలో చిలపోగు చిన్నయ్య (45) నివాసం ఉంటున్నాడు. అతనికి శివకుమార్ అలియాస్ సూరి అనే కుమారుడు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్నయ్య కూలి పనులకు వెళ్తుంటాడు. సూరి మద్యానికి అలవాటు పడి జులాయిగా తిరుగుతుంటాడు. బుధవారం రాత్రి చిన్నయ్య ఇంట్లో ఉండగా సూరి మద్యం తాగొచ్చి తండ్రితో గొడవపడి దాడి చేసి హతమార్చాడు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు సబ్బు నీళ్లను చిన్నయ్య నోట్లో పోసి నురగ వచ్చేలా చేశాడు. గురువారం తెల్లవారుజామున ఇంటి పక్కన వారికి తన తండ్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే చిన్నయ్య శరీరంపై గాయాలుండటాన్ని గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సూరి సమీప అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు తమ సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. కాలనీకి చెందిన కొందరు అటవీ ప్రాంతానికి వెళ్లి సూరి ని వెతికి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.