
మద్యంలో సరికొత్త డీల్
కందుకూరు: కందుకూరులో మద్యం వ్యాపారం సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఆదాయమే పరామావధిగా మందుబాటుల జేబులు గుల్లచేసే సరికొత్త విధానానికి మద్యం వ్యాపారులు తెరతీశారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న సామెతగా మద్యంషాపుల యజమానులు, బార్ల యజమానులు ఓ అవగాహనకు వచ్చి భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. దీంతో మందుబాబులు నిలువుదోపిడీకి గురౌతున్నారు. కందుకూరు పట్టణంలో అమలవుతున్న ఈ సరికొత్త విధానంపై మందుబాబు ఇదేం దోపిడీ అంటూ లబోదిబోమంటున్నారు.
ఇదీ ఒప్పందం
కందుకూరు నియోజకవర్గంలో మొత్తం 21 ప్రైవేట్ మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో 17షాపులు మద్యం వ్యాపారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటే, మరో 4 షాపులు గౌడ కులస్తులకు కేటాయించినవి. అయితే గౌడ కులస్తుల షాపులను కూడా సిండికేట్ వ్యాపారులు స్వాధీనం చేసుకుని నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రధానంగా కందుకూరు పట్టణంలో 7 మద్యం షాపులు ఏర్పాటు చేశారు. మరో మూడు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. మద్యం షాపులకు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే సిండికేట్‌గా ఏర్పడి దక్కించుకుని నిర్వహించుకుంటున్నారు. నిన్నటి వరకు వేళాపాళా లేకుండా ఇష్టం వచ్చినట్లు మద్యంషాపులు నిర్వహించుకుంటూ దోపీడీ చేస్తూ వస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు లూజ్ సేల్స్ చేయడంతో పాటు, సిట్టింగ్ రూమ్‌లు ఏర్పాటు చేసి విచ్చలవిడిగా వ్యాపారం నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు, షాపుల యజమానుల మధ్య కొంత వివాదం నడుస్తోంది. అదే సమయంలో మద్యం షాపుల్లో విచ్చలవిడి అమ్మకాల వల్ల పట్టణంలోని బార్‌ల యజమానులకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో మద్యంషాపుల యజమానులు, బార్ల యజమానులు కలిసి ఓ అవగాహనకు వచ్చి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా మద్యంషాపుల్లో లూజ్ సేల్ విక్రయించకూడదు, అదనపు సిట్టింగ్ రూమ్‌లను ఎత్తివేయాలి వంటి షరతులు ఉన్నాయి. బార్ల యజమానులు చేసిన ప్రతిపాదనకు మద్యంషాపుల యజమానులు అంగీకరించారు. దీనికి ప్రతిఫలంగా బార్లలో మద్యం బాటిల్స్ రేట్లను ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఉదాహరణకు క్వార్టర్ బాటిల్‌పై రూ.60 అదనంగా బార్ యజమానులు వసూల్ చేస్తారు. ఇలా క్వార్టర్ బాటిల్‌పై అదనంగా వసూల్ చేసిన 60 రూపాయల్లో రూ.30 మద్యంషాపుల యజమానులకు ఇచ్చేటట్లు, రూ.30 బార్‌ల యజమానులు తీసుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని గత వారం రోజులుగా పట్టణంలో అమలు చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం మద్యంషాపులో లూజ్‌సేల్ అమ్మకాలు, అదనపు రూమ్‌లను తీసివేశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మందుబాబులు కచ్చితంగా బార్‌లకు వెళ్లాల్సి వస్తోంది. బార్‌లకు వెళ్లి క్వార్టర్ బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే అదనంగా రూ.60 చెల్లించాల్సి వస్తోంది. ఇలా ప్రతి రోజు పట్టణంలోని మూడు బార్లలో 2వేల క్వార్టర్ బాటిళ్ల అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. అంటే బార్ యజమానులు ఒక రోజు అదనపు దోపిడీ రూ.1.20 లక్షలు. దీనిలో రూ.60 వేలు మద్యంషాపుల యజమానులకు ఇస్తే, మిగిలిన రూ.60 వేలు బార్ యజమానులకు దక్కుతుంది.
అంత ఇచ్చుకోలేం సార్
అదే సందర్భంలో మద్యంషాపుల యజమానులు, ఎకై ్సజ్, పోలీస్‌శాఖల అధికారుల మధ్య కూడా మామూళ్ల విషయంలో పొత్తు కుదరడం లేదని సమాచారం. అధికారులు అడిగినంత ఇచ్చుకోలేక నిబంధనల మేరకు షాపులు నిర్వహించుకునేందుకు మద్యంషాపుల యజమానులు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. నిన్న, మొన్నటి వరకు అదనపు సిట్టింగ్ రూమ్‌లతో పాటు, రాత్రి, పగలు అన్న తేడా లేకుండా అమ్మకాలు సాగించిన పట్టణంలోని మద్యంషాపులు సడన్‌గా రూటుమార్చాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10గంటల వరకు అమ్మకాలు సాగిస్తూ, లూజ్‌సేల్స్, అదనపు రూమ్‌లను పూర్తిగా రద్దు చేశారు. దీనికి ప్రధాన కారణం అధికారులకు ఇచ్చే మామూళ్ల విషయంలో అంగీకారం కుదరలేదని ప్రచారం సాగుతుంది. అధికారులు అడిగినంత ఇచ్చేందుకు షాపుల యజమానులు ససేమిరా అంగీకరించడం లేదు. ఒక్కో షాపుకు నెలకు రూ.25 వేలు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తుండగా, షాపుల యజమానులు మాత్రం రూ.15వేలు ఇస్తామంటూ మొండికేస్తున్నారు. ఈ మామూళ్ల విషయంలో ఇరువర్గాల మధ్య రాజీకుదరకపోవడంతో నిబంధనల ప్రకారం షాపులు నిర్వహించుకునేందుకు పట్టణంలోని మద్యంషాపుల యజమానులు సిద్ధమయ్యారు. అయితే దీనికి బదులుగా బార్ల యజమానుతో కొత్త ఒప్పందం చేసుకుని సరికొత్త దోపీడీకి స్కెచ్ వేశారు. అయితే మొత్తం వ్యవహారంలో మందుబాబులే జేబులు గుల్లచేసుకుంటున్నారు.
వందలకొద్దీ బెల్టుషాపులు
అయితే కందుకూరు పట్టణం మినహా ఇతర ప్రాంతాల్లోని మద్యంషాపుల్లో ఇష్టం వచ్చినట్లు బెల్టుషాపులు నిర్వహించుకుంటున్నారు. మద్యంషాపుల నుంచే నేరుగా బెల్టుషాపులకు ఆటోలు, కార్ల ద్వారా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రతి గ్రామంలో నాలుగు వరకు బెల్టుషాపులు నిర్వహిస్తూ దోపీడీకి పాల్పడుతున్నారు. గుడ్లూరులో రెండు మద్యంషాపులు ఉండగా వీటిలో ఒకటి కేవలం బెల్టుషాపులకు మద్యం సరఫరా చేసేందుకు కేటాయించినట్లు సమాచారం. ఈ విధానం ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గంలో బెల్టుషాపు లేని గ్రామం లేదంలే ఆశ్చర్యం కలగకమానదు. అయితే ఎకై ్సజ్ అధికారులుగాని, పోలీస్‌శాఖ అధికారులు గాని ఈ బెల్టుషాపుల జోలికి మాత్రం పోవడం లేదు.
దుకాణాలు, బార్ల యజమానుల మధ్య కొత్త ఒప్పందం
బార్‌లో క్వార్టర్ బాటిల్‌పై రూ.60 అదనంగా పెంచి
విక్రయాలు
వచ్చిన ఆదాయంలో చెరిసగం పంచుకునేలా అవగాహన
ఇదేం దోపిడీరా బాబూ
అంటున్న మందుబాబులు