
టీడీపీ నాయకుల గుండాగిరి
● వైఎస్సార్‌సీపీ మహిళా నేత
కుటుంబంపై దాడి
● కర్రలు, రాళ్లతో స్వైరవిహారం
● భయంతో ఇంట్లో
తలదాచుకున్న బాధితులు
● దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
● స్థల వివాదం ముసుగులో
కక్షసాధింపు చర్య
● వేదాయపాళెం పోలీసులకు
బాధితుల ఫిర్యాదు
నెల్లూరు సిటీ: జిల్లాలో అధికార అండతో టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు. నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్‌లో పోతురాజు మురళి, రమాదేవి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఆకాష్, లక్ష్మీదేవి సంతానం. రమాదేవి వైఎస్సార్‌సీపీ రూరల్ నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు. వీరు గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేశారు. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు పోతురాజు రవి, అతని అనుచరులు వారిపై కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం వనంతోపు సెంటర్‌కు సమీపంలో ఓ స్థలానికి సంబంధించి పోతురాజు గంగయ్య, సునీతలు కొలతలు వేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న టీడీపీ నేత పోతరాజు రవి, అతని బంధువులు గంగమ్మ, రమ, ఓబిలి సుజాత, విజయసారథి, రాజేష్, మురళి, శిరీషలు ఆ స్థలంపై తమకూ హక్కు ఉందంటూ కొలతలు ఆపాలని వారిని అడ్డుకున్నారు. అక్కడ వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమీపంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేత పోతురాజు మురళి దంపతులు గంగయ్యకు మద్దతుగా వచ్చారు. దాంతో టీడీపీ నేత పోతురాజు రవి, అతని వర్గీయులు మురళి కుటుంబంపై దాడికి దిగారు. దాదాపు 20 మంది ఒక్కసారిగా కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డంతో మురళి, రమదేవిలు గాయపడ్డారు. భయంతో వెంటనే తమ పిల్లలతో సహా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని తలదాచుకున్నారు. దాడి చేసిన వారు వెళ్లిపోయిన తరువాత బాధితులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరారు. వేదాయపాళెం పోలీసులకు ఇరువర్గాలు ఫిర్యాదు చేసుకున్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శ
వైఎస్సార్‌సీపీ నేత మురళి దంపతులపై టీడీపీ నాయకుల దాడిని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రూరల్ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డిలు ఖండించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏఎస్పీ సౌజన్యను సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. దాడికి సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. వారిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరారు.

టీడీపీ నాయకుల గుండాగిరి