కావలిలో పేట్రేగుతున్న గ్రావెల్‌ మాఫియా | - | Sakshi
Sakshi News home page

కావలిలో పేట్రేగుతున్న గ్రావెల్‌ మాఫియా

Published Thu, Mar 27 2025 12:37 AM | Last Updated on Thu, Mar 27 2025 12:35 AM

రూ.కోట్లల్లో దందా

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: కావలి, బోగోలు, దగదర్తి, అల్లూరు మండలాల్లో నాణ్యమైన గ్రావెల్‌ ఖనిజం విస్తారంగా ఉంది. గ్రావెల్‌ తవ్వకాలకు మండలానికి ఒక మాఫియా లీడర్‌ను పెట్టుకుని స్వయంగా ఎమ్మెల్యే దగుమాటి గ్రావెల్‌ దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దగమాటి ఎమ్మెల్యే కాక ముందే జలదంకి మండలం అన్నవరం క్వారీల నుంచి అక్రమంగా కంకర రవాణాలో చేయడంలో అనుభవం ఉండడంతో ఆ అనుభవంతోనే విలువైన సహజ ఖనిజ (గ్రావెల్‌) సంపదను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. హైవే అంచులు మెరక చేసేందుకు, లేఅవుట్ల ఏర్పాటుకు, ఇతర వాణిజ్య అవసరాలకు గ్రావెల్‌ తరలించేందుకు రాత్రి పగలూ తేడా లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు.

అందరి నోర్లు నొక్కి.. హైవే ఎక్కి..

గ్రావెల్‌ అక్రమంగా తవ్వి తరలించేందుకు ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ముందుగానే ఒప్పందాలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి చెందిన లోకల్‌ నాయకులు స్థానిక అవసరాల కోసం గ్రావెల్‌ తరలించుకునేలా, ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులు బరి తెగించి సహజ వనరుల దోపిడీ చేస్తున్నారు. చెరువు పోరంబోకు భూముల్లో లోకల్‌ నాయకులు తవ్వుకుంటుంటే, హైవేకు దగ్గరగా ఉండే ప్రభుత్వ, ప్రైవేట్‌, అటవీ భూముల్లో ఎమ్మెల్యే అనుచరులు తవ్వుకుంటున్నారు. కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్న కీలక నాయకుడు గ్రావెల్‌ తలింపులో కీలకంగా మారాడు. అక్రమ తవ్వకాలను ఆర్గనైజ్‌ చేస్తూ గ్రామాలను గుల్లగుల్లగా మార్చేస్తున్నారు. కావలి మండలం రుద్రకోట, బుడమగుంట, ముసునూరు, గౌరవరం, బోగోలు మండలం ముంగమూరు, కొండబిట్రగుంట, పాతబిట్రగుంట, కడనూతల, కోవూరుపల్లి, బోగోలు, కప్పరాళ్లతిప్ప, దగదర్తి మండలం ఉలవపాళ్ల, దామవరం, సున్నపుబట్టి, కౌరుగుంట, అల్లూరు మండలం నార్త్‌ఆములూరు, తదితర ప్రాంతాల్లో ప్రతి రోజూ హిటాచీలు, జేసీబీలు, టిప్పర్లు వినియోగించి తవ్వకాలు సాగిస్తున్నారు. తవ్వకాలపై స్థానికులు ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నెలవారీ మామూళ్లతో అధికారులు మౌనముద్ర వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

గగ్గోలు పెడుతున్న గ్రామస్తులు

ఊర్ల చుట్టూ ఉద్యమంగా జరుగుతున్న గ్రావెల్‌ తవ్వకాలపై గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు. ఊరి చుట్టూ తవ్వకాలు చేస్తుండడంతో పచ్చిగడ్డి కూడా మొలవడం లేదని, పశుగ్రాసం కోసం మూగజీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయని వాపోతున్నారు. గేదెలను చెరువులోకి తోలుకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా చెరువుల్లో రెండు నిలువు లోతులో గ్రావెల్‌ తవ్వేస్తున్నారని మండి పడుతున్నారు. దీంతో పశుపోషణ కూడా కష్టంగా మారి మూగజీవాలను కబేళాలకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉలవపాళ్ల సమీపంలో గని మాదిరిగా తవ్వేస్తున్న గ్రావెల్‌

మైనింగ్‌ అధికారులు లెక్కల ప్రకారం చూస్తే ఎకరా భూమిలో మీటరు లోతున తవ్వకాలు జరిపితే 4 వేల ఘనపు మీటర్ల ఖనిజం (గ్రావెల్‌) వెలువడుతోంది. టిప్పర్‌కు నిండుగా నింపితే 12 క్యూబిక్‌ మీటర్లు పడుతుంది. అంటే ఎకరాకు 400 టిప్పర్లు గ్రావెల్‌ వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు 4,800 క్యూబిక్‌ మీటర్లు రవాణా సాగుతోంది. టిప్పర్‌కు రూ.10 వేలు వంతున లెక్క పెడితే ఎకరాలో రూ.4 కోట్ల వరకు వస్తుంది. ఇది ఎకరా భూమిలో మీటరు లోతు తవ్వకాలు చేస్తే మరి పదిహేను మీటర్ల లోతు తీస్తే రూ.కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కావలి నియోజకవర్గంలో దాదాపు వందల ఎకరాల్లో గ్రావెల్‌ దందా నడుస్తోంది.

ఇది దగదర్తి మండలం ఉలవపాళ్లలో జరుగుతున్న గ్రావెల్‌ దందా..టీడీపీ నేత భారీయంత్రాలు ఉపయోగించి తవ్వకాలు చేయిస్తున్నారు. రోజువారీగా దాదాపు 500 టిప్పులు వరకు గ్రావెల్‌ తరలించేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు చేసి గ్రావెల్‌ తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు.. స్థానికులు అడ్డు చెపితే మాత్రం కేసుల పేరుతో బెదిరిస్తున్నారు.

గ్రావెల్‌ అక్రమ రవాణా చేస్తున్నారు

నియోజకవర్గంలో గ్రావెల్‌ అక్రమ రవాణా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోంది. కొందరు అనుచరుల ద్వారా గ్రావెల్‌ రవాణాకు ఎక్కడా అవాంతరాలు రాకుండా ఉండేలా చేసుకున్నాడు. గ్రావెల్‌ దందాను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేయిస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసినా పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌, ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ శాఖలు చేతులు ముడుచుకుని ఉండి పోయాయి. కావలి సేవకుడిని అంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్న ఎమ్మెల్యే గ్రావెల్‌ దందాతో సహజ వనరులను కొల్లగొడుతున్నారు.

– రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కావలి

కావలిలో పేట్రేగుతున్న గ్రావెల్‌ మాఫియా 1
1/2

కావలిలో పేట్రేగుతున్న గ్రావెల్‌ మాఫియా

కావలిలో పేట్రేగుతున్న గ్రావెల్‌ మాఫియా 2
2/2

కావలిలో పేట్రేగుతున్న గ్రావెల్‌ మాఫియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement