నెల్లూరు రూరల్: వెట్టిచాకిరీని నిర్మూలించేందుకు రెవెన్యూ అధికారులు కృషి చేయాలని నెల్లూరు ఆర్డీఓ అనూష కోరారు. నగరంలోని కలెక్టరేట్‌లో ఉన్న తిక్కన ప్రాంగణంలో నెల్లూరు, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులకు శుక్రవారం వెట్టిచాకిరి నిర్మూలన చట్టంపై సాంఘిక సంక్షేమ శాఖ, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ప్రతినిధులు శ్యామ్, గంటా ప్రియాంక ఆధ్వర్యంలో వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్, లేబర్, విద్య, వైద్య ఇతర శాఖల సమన్వయంతోనే వెట్టిచాకిరి నిర్మూలన సాధ్యపడుతుందన్నారు. ఇటుకబట్టీలు, రైస్‌మిల్లులు, హోటళ్లు, మద్యం దుకాణాలు, పలు వ్యాపార సంస్థల్లో అధికారులు నిర్వహించే తనిఖీలు ఎంతోమంది అభాగ్యుల జీవితాలను మారుస్తాయన్నారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందిన వ్యక్తికి కలెక్టర్ ఆనంద్ చేతుల మీదుగా రిలీజ్ సర్టిఫికెట్‌ను అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, చైతన్య జ్యోతి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, పలు వ్యాపార సంస్థలు, హోటళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.