
ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమే
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): కూటమి ప్రభుత్వం పాలనా వైఫల్యాలను, తప్పుడు ప్రచారాలను వెలుగెత్తి చూపుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై తప్పుడు ఫిర్యాదులు, కేసులు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నమని ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్లి నిర్మల ధ్వజమెత్తారు. బుధవారం ఆమె బుధవారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాకాణి నిబద్ధత గల నాయకుడని, ఆయనపై అక్రమ మైనింగ్ కేసు పెట్టడం అధికార పార్టీ నాయకుల కక్ష సాధింపు చర్యలుగా అభివర్ణించారు. నిరాధార ఆరోపణలతో కాకాణిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పోరాట పటిమను తట్టుకోలేక అధికార పార్టీ నాయకులు వేధింపులకు గురి చేయడానికే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కాకాణి మంత్రిగా ఉన్నప్పుడు అక్రమ మైనింగ్‌పై విచారణ చేయాలని ఆదేశించారన్నారు. అప్పటి అధికారులు విచారణ జరిపి అసలు అక్కడ మైనింగే జరగలేదని నివేదికను అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2003లో అప్పటి మంత్రిగా ఉండి ఒక ఎమ్మెల్యేతో కలిసి అక్రమ మైనింగ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందేనన్నారు. అప్పటి జిల్లా అటవీ శాఖాధికారి స్వయంగా వాహనాలను సీజ్ చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. అధికార పార్టీలో ఉండి ఒక బీసీ వర్గానికి చెందిన ఆ అటవీ శాఖాధికారిని టార్గెట్ చేసి అక్రమ బదిలీ చేశారని తెలిపారు. అప్పట్లో బీసీ నాయకులు మూడు రోజులు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేసిన వైనాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. వెంకటాచలంలో జరిగిన దాష్టీకాలను, అల్లీపురంలో నకిలీ విత్తనాలు, ఎరువుల తయారీ, వన సంరక్షణ నిధులను దోచుకున్న వైనాన్ని ప్రజలు మర్చిపోరని, ఎవరు నిబద్ధత గల నాయకుడో ప్రజలకు తెలుసన్నారు. నిరంతరం శ్రమించే తమ నాయకుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసును సంబంధించి క్వాష్ పిటిషన్‌తో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, ఉద్దేశపూర్వకంగా నోటీసులు పంపించడం వేధింపుల్లో భాగం కాదా అని ప్రశ్నించారు. ఐదు సార్లు ఎన్నికల్లో ఓడిపోయి దింపుడు కల్లాం ఆశగా ఈ సారి టికెట్ లభిస్తే గెలుస్తామా?, ఓడిపోతామా అనే సందిగ్ధంలో నుంచి గెలిచి అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఇటువంటి వారి లెక్కలు సరి చేస్తారని చెప్పారు.
మైనింగ్ కేసులో కాకాణిపై తప్పుడు ఫిర్యాదులు, కేసులు
జగనన్న మళ్లీ సీఎం అవుతారు.. అందరి లెక్కలు సరిచేస్తారు
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మల్లి నిర్మల