
తప్పుడు వాగ్మూలంతో కాకాణిపై అక్రమ కేసు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): తప్పుడు వాంగ్మూలంతో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని, ఇది కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్ట అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. శుక్రవారం నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత శనివారం వరకు కాకాణి నెల్లూరులోనే ఉన్నా నోటీసులు ఇవ్వడానికి రాని పోలీసులు, ఉగాది పండగ కోసం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ వెళ్లినప్పుడే, కావాలనే ఆయన ఇంటికి నోటీసు అంటించి మర్నాడే విచారణకు రావాలని చెప్పడం చూస్తే వేధింపులకు గురి చేయమే అన్నారు. జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ చూడని విధంగా సీనియర్ నాయకుల మీద అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ వికృత రాజకీయాలు చూసి అన్ని వర్గాల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కాలని కూటమి ప్రభుత్వం ఈ వికృత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. డైవర్షన్‌న్ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టి మళ్లించాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం
రాజకీయంగా ఎదుర్కోలేక వేధించడం కోసమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం చేస్తున్నారని మేరిగ ఆరోపించారు. ఇటీవల సుప్రీంకోర్టు సైతం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ఫిర్యాదుల విషయంలో నమోదు చేసే కేసులకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. రాజకీయ నాయకులను వేధించడానికి అట్రాసిటీ చట్టాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు.
రాజకీయ వేధింపులకే
అట్రాసిటీ చట్టం దుర్వినియోగం
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను
నొక్కేసే కుట్ర
ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్