
నష్టపోతుంది చిన్నారులే..
ఉలవపాడు: కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం మండలాలున్నాయి. మొత్తం 184 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ప్రతినెలా గర్భిణులకు సీమంతాలు, పౌష్టికాహారంపై తల్లిదండ్రులకు అవగాహన, ఇతర కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.500 చొప్పున ఇస్తుంది. వేసవి సెలవుల్లో కేవలం 15 రోజులు మాత్రమే కేంద్రాన్ని కార్యకర్త తెరుస్తారు. కాబట్టి ఆ నెలలో రూ.250 ఇస్తారు. 11 నెలలకు సంబంధించి రూ.5,500 మరో సగం నెలకు రూ.250 కలిపి రూ.5,750 ఇటీవల కార్యకర్తల బ్యాంక్ ఖాతాల్లో గత నెలలో జమైంది.
మాకు డబ్బులివ్వాలి
ప్రభుత్వం జమ చేసిన మొత్తంలో ఒక్కో కేంద్రం నుంచి తమకు రూ.2,400 ఇవ్వాలని సూపర్‌వైజర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈవెంట్లు సక్రమంగా చేయలేదని చెబుతూ కొంత మొత్తాన్ని తమకు ఇస్తేనే చూసీచూడనట్టు ఉంటామని కార్యకర్తలతో వాదిస్తున్నట్లు తెలిసింది. నగదు వసూలు చేయడానికి కొందరు అంగన్‌వాడీలను నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ప్రతినెలా ఒక్కో సెంటర్ నుంచి రూ.200 కూడా వీరే వసూలు చేస్తారు. ఈ నగదు ఇస్తున్న కార్యకర్తలు ఈవెంట్ల డబ్బును ఇవ్వడానికి ఇష్డపడటం లేదు. ఇంత దారుణం ఏంటని చర్చించుకుంటున్నారు.
అంతా లంచాలమయం
ఉలవపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ లంచాలమయంగా మారిపోయింది. 184 సెంటర్లకు సంబంధించి రూ.10.58 లక్షలు కార్యకర్తల ఖాతాల్లో జమయ్యాయి. ఇందులో రూ.4.41 లక్షలు సూపర్‌వైజర్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉలవపాడు మండల పరిధిలో ఐదుగురు సూపర్‌వైజర్లున్నారు. సక్రమంగా ఈవెంట్లు చేయలేదు కాబట్టి ఒక్కో కార్యకర్త రూ.3,350 పెట్టుకుని మిగిలిన రూ.2,400 ఇవ్వాలని వారు ఒత్తిడి తీసుకొస్తున్న దుస్థితి ఉలవపాడు ప్రాజెక్ట్‌లో నెలకొంది. దీనికితోడు కూరగాయలు, గ్యాస్ బిల్లులు కూడా బ్యాంక్ ఖాతాల్లో పడ్డాయి. వీటిలో 15 శాతం కచ్చితంగా కార్యాలయ సిబ్బందికి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. చాలాకాలంగా సిబ్బంది ఈ కమీషన్ తీసుకుంటున్నారు.
చర్యలు తీసుకుంటాం
నేను కొత్తగా వచ్చాను. సూపర్‌వైజర్లు, కార్యకర్తలతో మాట్లాడతాం. అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటాను.
– నిర్మలాదేవి, ఐసీడీఎస్ ఇన్‌చార్జి పీడీ
లంచాలు, అవినీతి, కమీషన్ల కోసం ఐసీడీఎస్‌లో పెద్ద పంచాయితీ నడుస్తోంది. దీనికి కారణం ఈవెంట్లకు సంబంధించిన నగదు ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తల ఖాతాల్లో జమ చేయడమే. వాటిలో తమకు వాటా ఇవ్వాలని సూపర్‌వైజర్లు డిమాండ్ చేశారు. అలా ఇస్తే ఎలా అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై వారి మధ్య వివాదం నెలకొంది.
ఐసీడీఎస్‌లో ఈవెంట్ల లొల్లి
ప్రభుత్వ సొమ్ము స్వాహా కోసం యత్నం
ఒక్కో కేంద్రం నగదు ఇవ్వాల్సిందే
అంటున్న సూపర్‌వైజర్లు
మరీ ఇంత దోపిడీనా అని ప్రశ్నిస్తున్న కార్యకర్తలు
ప్రాజెక్ట్ పరిధిలో ఇంత దారుణంగా ఈవెంట్ల పంచాయితీ ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ఇక్కడకు నూతనంగా వచ్చిన సీడీపీఓ అరుణకుమారి పూర్తిస్థాయిలో పరిస్థితులను గమనించకపోవడం. సూపర్‌వైజర్లు చెప్పినట్లే వినడం తప్ప వారు క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారో దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ఏది ఏమైనా కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరపకుండానే బాగా చేశామని చూపడం, దానికి సంబంధించిన నిధులు పంచుకోవడం చూస్తుంటే చివరికి నష్టపోతుంది ఈ సెంటర్లకు వెళ్తున్న చిన్నారులే. ప్రభుత్వం చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు ఖర్చు పెట్టమని ఇస్తున్న నిధుల్ని స్వాహా చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులను సక్రమంగా వినియోగించి అంగన్‌వాడీ కేంద్రాలను మెరుగుపరచడానికి ఉన్నతాధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.

నష్టపోతుంది చిన్నారులే..