
ప్రభుత్వ దృష్టికి రెవెన్యూ సమస్యలు
నెల్లూరు రూరల్: రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న రెవెన్యూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తామని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జేసీ కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ, డీఆర్వో ఉదయభాస్కరరావు, ఆర్డీఓలతో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. పలు పరిశ్రమలు, విద్యాసంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు, ప్రైవేట్ పట్టా భూములను నిషేధిత 22 ఏ జాబితా నుంచి తొలగించడం తదితర అంశాలను కలెక్టర్ దృష్టికి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తీసుకొచ్చారు. వీటిపై చర్చించి పరిష్కారానికి తగు సూచనలు చేశారు. జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డుల ఏడీ నాగశేఖర్, నెల్లూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, వంశీకృష్ణ, పావని పాల్గొన్నారు.