
కుమారుడిని కాలేజీలో వదిలి ఇంటికెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం
● భార్యకు తీవ్రగాయాలు
పొదలకూరు: ఆ దంపతులిద్దరూ తమ కుమారుడిని నెల్లూరులోని శ్రీచైతన్య కాలేజీలో వదిలిపెట్టి తిరిగి స్వగ్రామానికి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చేజర్ల మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన బండి రామయ్య (35), బండి శ్రీవాణి దంపతులకు ఇద్దరు సంతానం రామయ్య ఊర్లో చేనేత మగ్గం నేస్తూ ఇటీవల బ్రాందీ షాపులో పనికి చేరి జీవనం సాగిస్తున్నాడు. కుమారుడు ఇంటర్ పరీక్షలు రాశాడు. ఫలితాల్లో ఆశించిన మార్కులు రాకపోవడంతో ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకున్నాడు. తల్లిదండ్రులు, కుమారుడు మోటార్‌బైక్‌పై నెల్లూరుకు వచ్చారు. కుమారుడిని కాలేజీలో వదిలిన ఆ దంపతులు ఇతర పనులు చక్కబెట్టుకుని ఇంటికి బయలుదేరారు. పొదలకూరు మీదుగా చిత్తలూరు వెళ్తుండగా పట్టణానికి సమీపంలో స్వర్ణ లేఅవుట్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ధాన్యం లోడుతో పొదలకూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్న లారీ రామయ్య దంపతులను ఢీకొంది. దీంతో రామయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా శ్రీవాణి తలపై తీవ్రగాయమైంది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ వచ్చి ఆమెను స్థానిక సీహెచ్‌సీకి తరలించింది. మరో గంటలో ఇంటికి చేరాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. రామయ్య హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు పోయేవి కాదని స్థానికులు చెబుతున్నారు. ఎస్సై ఎస్‌కే హనీఫ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.