
స్వగ్రామానికి వెళ్తుండగా..
● చెట్టును ఢీకొట్టిన మోటార్‌బైక్
● ఘటనా స్థలంలో యువతి,
చికిత్స పొందుతూ యువకుడి మృతి
మర్రిపాడు: పెంచలకోనకు వెళ్లి దైవ దర్శనం చేసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా మోటార్‌బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో యువతి ప్రమాద స్థలంలోనే మృతిచెందగా.. యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని కదిరినాయుడుపల్లి వద్ద జాతీయ రహదారి – 67పై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరుకు చెందిన మల్లి నరసింహులు (26) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. పట్టణంలోని రూపరాంపేటకు చెందిన యాడగాలి ఝాన్సీ (26) కూడా అక్కడే పనిచేస్తోంది. ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం బద్వేలు నుంచి బైక్‌పై పెంచలకోనకు వెళ్లారు. అక్కడ దైవ దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం బద్వేలుకు బయలుదేరారు. కదిరినాయుడుపల్లి సమీపానికి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో వెనుక కూర్చొన్న ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందింది. నరసింహులును 108 అంబులెన్స్‌లో బద్వేలు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మర్రిపాడు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
టాటా మ్యాజిక్‌ను
ఢీకొన్న టిప్పర్
వింజమూరు(ఉదయగిరి): మండలంలోని చంద్రపడియ సమీపంలో ఇసుక తరలిస్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టిన ఘటన ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కాలేషా తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆత్మకూరు – వింజమూరు రోడ్డు మార్గంలో అధికలోడుతో టిప్పర్లు ఇసుకను తరలిస్తున్నాయి. అతివేగంగా రాకపోకలు సాగిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పోలీసులు అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.

స్వగ్రామానికి వెళ్తుండగా..