
మహిళలు, చిన్నారుల గృహ నిర్బంధం
తోటపల్లిగూడూరు: బాకీ వసూలు విషయంలో మహిళలు, చిన్నారులను ఐదురోజులుగా గృహ నిర్బంధంలో ఉంచిన ఘటన మండలంలోని చింతోపు గ్రామంలో జరిగింది. లేబూరు కల్యాణి, లేబూరు మేఘ వర్షిత మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమ మామ లేబూరు మల్లికార్జున్ చింతోపు పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నాడన్నారు. ఆయన గ్రామానికి చెందిన గండవరం అనిల్ – సంధ్యకు నగదు బాకీ ఉన్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందన్నారు. మామ, ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయం చూసి ఐదు రోజులుగా అనిల్ – సంధ్య, మరికొందరు తమ ఇంటి వద్ద టెంట్ వేసి నిరసనకు దిగారన్నారు. తమను, పిల్లల్ని ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా గృహ నిర్బంధం చేశారన్నారు. కేసు కోర్టులో ఉంది కదా అనడిగితే తిడుతున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. మల్లికార్జున్ వైఎస్సార్‌సీపీ మద్దతు సర్పంచ్ కావడంతో రాజకీయంగా వేధిస్తున్నట్లు వాపోయారు.