
హాస్టల్ విద్యార్థులకు కలెక్టర్ ప్రశంసలు
నెల్లూరు రూరల్: ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రతిభ చూపిన జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు కలెక్టర్ ఒ.ఆనంద్ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. నెల్లూరు సాంఘిక సంక్షేమ కేంద్ర ప్రభుత్వ హాస్టల్ విద్యార్థిని యాదల సంగీత ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఎంపీసీలో 961 మార్కులు, బద్దిపూడి మేఘన సీఈసీలో 927 మార్కులు సాధించారు. పదో తరగతిలో వింజమూరు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థిని ఎ.నందిని 574 మార్కులు, ఉలవపాడు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ విద్యార్థిని ఎన్.కాజోల్ లక్ష్మీ అగర్వాల్ 568 మార్కులు, ఆత్మకూరు సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ విద్యార్థి ఒంటేరు సాయిధనుష్ 565 మార్కులు సాధించారు. వారిని శుక్రవారం నెల్లూరులోని తన కార్యాలయంలో కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ బాగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారిణి శోభారాణి పాల్గొన్నారు.