పుట్టపర్తి టౌన్: ‘‘నాకు 2017 సంవత్సరంలో అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామానికి చెందిన నాగేంద్రతో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల తర్వాత నా భర్త చిత్రహింసలకు గురిచేశాడు. విషయం మాపెద్దలకు తెలపగా, వారు అదనపు కట్నం ఇచ్చి సర్దిచెప్పారు. నాకు ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త నన్ను సరిగా చూసుకోవడం లేదు. ఒళ్లంతా గాయాలయ్యేటట్టు కొడుతున్నాడు. గతంలోనే ఇటుకులపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా...వారు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయినా నా భర్త మారలేదు. విడాకులు కావాలని ఇబ్బంది పెడుతున్నాడు. నాకు, నా పిల్లలకు మీరే న్యాయం చేయండి’’ అని ధర్మవరం కేతిరెడ్డి కాలనీకి చెందిన మాధవి స్పందనలో ఎస్పీ మాధవరెడ్డిని వేడుకుంది. స్పందించిన ఆయన కేసు వివరాలు ఆరా తీశారు. త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
స్పందనకు 47 అర్జీలు..
జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 47 అర్జీలు అందాయి. ఎస్పీ మాధవరెడ్డి అర్జీదారులతో ఓపికగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదుదారుల సమక్షంలోనే సంబంధిత సబ్ డివిజన్లు, పోలీసుస్టేషన్ల అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సత్వరం పరిష్కారం చూపేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. స్పందన కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీకి చట్ట పరిధిలో న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆడిషనల్ ఎస్పీ విష్ణు, దిశ డీఎస్పీ వరప్రసాద్, లీగల్ అడ్వైజర్ సాయినాథరెడ్డితో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బాలిక అదృశ్యంపై ఎస్పీకి ఫిర్యాదు
ఐదురోజుల క్రితం నా కూతురు ప్రియదర్శిని కొత్తచెరువు బస్టాండు వద్ద అదృశ్యం కాగా, కొత్తచెరువు పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎస్‌ఐ పట్టించుకోవడం లేదని పుట్టపర్తి మండలం కంబాలపర్తికి చెందిన శ్రీనివాసులు ఎస్పీ ఎదుట వాపోయారు. విచారణ జరిపి తన బిడ్డ ఆచూకీ కనిపెట్టాలని ఎస్పీని కోరారు. స్పందించిన ఎస్పీ వెంటనే కొత్తచెరువు పోలీసుస్టేషన్‌కు ఫోన్ చేసి కేసులో పురోగతి సాధించాలని ఆదేశించారు.
అసాంఘిక శక్తులను అణచివేయండి
ధర్మవరం అర్బన్: శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులను అణచివేయాలని ఎస్పీ మాధవరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన ధర్మవరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, దర్యాప్తు తీరును డీఎస్పీ శ్రీనివాసులు, టూటౌన్ సీఐ రాజాతో ఆరా తీశారు. ముఖ్యమైన కేసులకు సంబంధించిన చార్జ్‌షీట్ వీలైనంత త్వరగా వేయాలన్నారు. వాణిజ్య కేంద్రమైన ధర్మవరంలో ఎక్కడా అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదన్నారు. వార్డుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, చిన్నపాటి గొడవలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మట్కా, పేకాట తదితర వాటిపై నిఘా ఉంచి పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా నడుచుకోవాలని, ఓపికతో సమస్య తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment