మూడు గంటల్లో ఛేదించిన పోలీసులు
మేకప్ చేయడానికి వచ్చిన బ్యూటీషియనే దొంగ
పామిడి: ఫంక్షన్ హాలులో వధువు బంగారు ఆభరణాలు అదృశ్యమయ్యాయి. ప్రత్యామ్నాయ నగలు అలంకరించి పెళ్లి కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారును రికవరీ చేశారు. వధువును అలంకరించేందుకు వచ్చిన బ్యూటీషియనే దొంగ అని గుర్తించారు.
వివరాల్లోకెళితే.... రామరాజుపల్లికి చెందిన విశ్వనాథరెడ్డి కుమార్తె పెళ్లి పామిడిలోని కోగటం ఫంక్షన్‌హాలులో జరిగింది. గురువారం రాత్రి రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం తలంబ్రాలు. వధువుకు సంబంధించిన 28 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. నగల మాయంపై పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను ఆరా తీస్తే బాధపడతారేమోనని వధువు కుటుంబ సభ్యులు మిన్నకుండిపోయారు. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ నగలతో అలంకరించి పెళ్లి ఘట్టం ముగించారు.
తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన వధువు తండ్రిని గమనించిన స్నేహితులు రెక్కల చిన్న నాగిరెడ్డి ఆధ్వర్యంలో రామరాజుపల్లికి చెందిన రామశేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి పోలీసులకు సమాచారమందించారు. స్పందించిన సీఐ యుగంధర్ తన సిబ్బందితో ఫంక్షన్ హాలుకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆధారాలు లభించలేదు. దీంతో పెళ్లి కుమార్తె గదిని పరిశీలించారు. అక్కడ పైకప్పు పీఓపీ కొంత గ్యాప్ కనిపించింది. అక్కడేముందని చూడగా రెండు ఖాళీ నగల బాక్సులు కిందపడ్డాయి.
ఇక్కడే ఏదో జరిగిందని అర్థమైంది. గదిలో ఎవరెవరు ఉన్నారు. ఎవరెవరు వచ్చి వెళ్లారు అని సీఐ ఆరా తీశారు. మేకప్ చేయడం కోసం బెంగళూరు నుంచి వచ్చిన బ్యూటీషియన్ తీరుపై అనుమానం కలగడంతో.. ఆమెను తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటకొచ్చింది. తానే నగలు తస్కరించానని, వాటిని వాష్‌రూమ్‌లో ఫ్లష్‌ట్యాంకులో దాచి పెట్టిన నగలను చూపించింది. అనంతరం బ్యూటీషియన్‌పై సీఐ కేసు నమోదు చేశారు. మూడు గంటల వ్యవధిలోనే బంగారు నగలను రికవరీ చేసిన సీఐకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment