ఓడిపోయాక పట్టుమని పది రోజులు కూడా లేకుండానే పార్టీ మారి నమ్ముకున్న కేడర్‌ను నట్టేట ముంచారు ఒకరు. పెత్తందారీతనానికి కేరాఫ్‌గా మారి కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలను చిన్నచూపు చూసే వారు మరొకరు. ఇద్దరిలో టికెట్ ఎవరికిస్తారో తెలియక, ఎవరికి జై కొట్టాలో స్పష్టత లేక అయోమయం నెలకొన్న సమయంలోనే.. పానకంలో పుడకలా జతకలసి తామూ మీ వైపే అని ప్రకటించిన వారు మరొకరు. ఈ మూడు ముక్కలాట అర్థం కాని టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రం మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేమంటూ తమ దారి తాము చూసుకుంటున్నారు.
ధర్మవరం: నియోజకవర్గంలో టీడీపీ దిక్కులేనిదిగా మారింది. అధిష్టాన వైఖరిని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. జైల్లో ఉన్న చంద్రబాబును పరామర్శించిన అనంతరం ఇటీవల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటన ఆ పార్టీ కేడర్‌లో గందరగోళం పెంచింది. పొత్తు కారణంగా జనసేనకు టికెట్ కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన నెలకొంది. వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ అభ్యర్థిగా వస్తానంటూ ఏడాది కాలంగా మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తన అనుచరుల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.
మరోవైపు పరిటాల శ్రీరామ్ తనకే టికెట్ ఖరారయ్యిందంటూ చెప్పుకుంటున్నారు. ఇలా ఎవరికి ఎవరు టికెట్ తమదంటే తమదంటుండడంతో ఆ పార్టీ కేడర్ మొత్తం అయోమయంలో పడింది. ఒకవేళ వరదాపురం సూరికే టికెట్ వస్తే ఓడిన తర్వాత మళ్లీ పార్టీ మారి తమను వెర్రిపప్పలను చేయడం ఖాయమని బాహాటంగానే విమర్శిస్తున్నారు. శ్రీరామ్‌ను నిలబడితే రాప్తాడు నియోజకవర్గం నుంచి పరిటాల కుటుంబీకులు వచ్చి పెత్తనం చెలాయిస్తారని, అది తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.
వీరిద్దరిని కాదని జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తే తామెందుకు పని చేస్తామని ప్రశ్నిస్తున్నారు. టీడీపీలో ఉంటే ఇంకొకరి పల్లకీ మోయడం తప్ప ఫలితం ఉండదనే డైలమాలో పడుతున్నారు. క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరం జరుగుతున్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి కనీసం స్పందన కరువు కావడం ఇందుకు నిదర్శనం.
చూపు.. వైఎస్సార్‌సీపీ వైపు..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్ఫూర్తితో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరదాపురం సూరి 11 రోజులకే బీజేపీ తీర్థం పుచ్చుకుని టీడీపీ కేడర్‌కు షాక్ ఇవ్వడంతో.. అధికార పార్టీ ప్రతీకార రాయకీయాలకు దిగితే తమకు దిక్కెవరని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందారు. అయితే ఎమ్మెల్యే కేతిరెడ్డి మాత్రం ఎక్కడా వైఎస్సార్‌సీపీ కేడర్‌ను అటు వైపు మళ్లకుండా గట్టి చర్యలు చేపట్టారు. తన దృష్టి మొత్తం నియోజకవర్గ అభివృద్ధిపైనే కేంద్రీకరించారు. నియోజకవర్గంలో 13,500కు పైగా ఇళ్లు మంజూరు చేయించారు. పట్టణంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో పేదలకు 11 వేలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment