
మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం
మడకశిర: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేలాది తాగునీటి సరఫరా పైపులు దగ్ధమయ్యాయి. రూ.కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు
వైఎస్సార్ సీపీ హయాంలో రూ.68 కోట్లతో మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని ఏఐఐబీ (ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ స్కీం) కింద తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ప్రస్తుతం ట్యాంకుల నుంచి పైప్‌లైన్లు ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన వేలాది ప్లాస్టిక్ పైపులు, ఇతర సామగ్రిని వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఓ రేకుల షెడ్‌లో నిల్వ ఉంచారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా మార్కెట్ యార్డులో మంటలు చెలరేగాయి. మార్కెట్ యార్డులోని రేకుల షెడ్‌లో నిల్వ ఉంచిన పైపులకు కూడా మంటలు వ్యాపించాయి. మార్కెట్ యార్డును పూర్తిగా పొగకమ్మేసింది. విషయం తెలుసుకున్న ట్రైనీ డీఎస్పీ ఉదయపావని, మున్సిపల్ కమిషనర్ రంగస్వామి, తహసీల్దార్ కరుణాకర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజిన్లను రంగంలోకి దింపారు. అగ్నిమాపక శాఖ అధికారులు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మార్కెట్ యార్డులో
తాగునీటి పైపుల దగ్ధం
రూ.కోట్లలో ఆస్తినష్టం

మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం

మడకశిరలో భారీ అగ్ని ప్రమాదం